సముద్రం ఏదైనా ఒక దేశం పరిధిలో ఉంటే, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ దేశానిదే అవుతుంది. అంతర్జాతీయ జలాలు మాత్రం ఎవరికీ పట్టని అనాథల్లా మిగిలిపోతున్నాయి. విపరీతమైన కాలుష్యం, మితిమీరిన చేపల వేటతో ఈ జలాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది.
ప్రస్తుతం ఉన్న తరంతో పాటు, భవిష్యత్తు తరాలూ సముద్రుడి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే కఠినమైన నిబంధనలతో కూడిన ఒక ఒప్పందం ఉండి తీరాల్సిందేనని ఐక్యరాజ్యసమితి భావించింది. అందుకే అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్య సంరక్షణకు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. దీన్నే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిసిడిక్షన్ (బీబీఎన్‌జే) ఒప్పందం అంటున్నారు. సముద్రాలలో ఉండే పర్యావరణ వ్యవస్థను కాపాడటం, బాధ్యతాయుతంగా వినియోగించుకోవటం, వాటిలో ఉండే జీవవైవిధ్యానికి ఉండే విలువలను సంరక్షించడం…ఇలాంటి లక్ష్యాలతో 75 అధికరణలతో ఈ కొత్త ఒప్పందంలో చేర్చాలని భావిస్తోంది. ‘‘సముద్రం అనేది మన భూగ్రహానికే జీవనాడి లాంటిది. ఈ కొత్త ఒప్పందానికి సూత్రప్రాయ ఆమోదం తెలపడం ద్వారా మీరంతా సాగరుడికి ఓ కొత్త జీవితాన్ని, ఆశను అందించారు’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతటి ఆవేదన దాగి ఉందో గమనించాలి. ప్రతి యేటా మన సముద్రాలలోకి కోట్ల టన్నుల కొద్దీ రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సూక్ష్మప్లాస్టిక్ లు వెల్లువలా వెళ్తున్నాయి. వీటి వల్ల చేపలు, సముద్ర తాబేళ్లు, సముద్ర పక్షులు, క్షీరదాల సంతతి గణనీయంగా దెబ్బతింటోంది. 2021 వ సంవత్సరంలో 1.7 కోట్ల టన్నుల పాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరాయి. సముద్రాల్లో ఉన్న మొత్తం వ్యర్థాల్లో వీటి వాటానే 85% ఉండడం గమనార్హం. 2040 నాటికి ఈ మొత్తం రెట్టింపు లేదా మూడు రెట్లు అవుతుందని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక అంచనా వేసింది.
తక్షణ చర్యలు చేపట్టకోతే మరో పాతికేళ్లలో సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువ ఉంటాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో ఉన్న మత్స్య సంపదలో మూడోవంతును వివిధ దేశాలకు చెందిన వారు అతిగా వేటాడుతున్నారు. దీనివల్ల మత్య్ససంపద పెరగాల్పినంత పెరిగేలోపే అది మనుషుల ఆకలికి బలైపోతోంది. దానికి తోడు సముద్రాలలో ఉండాల్సిన జీవవైవిధ్యం గణనీయంగా దెబ్బతింటోంది. కొత్త ఒప్పందం ప్రకారం చేపల వేట విషయంలో కొన్ని కఠిన నియంత్రణలు ఉండబోతున్నాయి. ప్రాంతాల వారీగా కొన్ని సంస్థలను ఏర్పాటుచేసి, చేపల వేటకు సంబంధించిన నియమ నిబంధనలను పక్కాగా పాటించేలా చూడాలన్న ప్రయత్నం జరుగుతోంది. సముద్రాలలో ఉష్ణోగ్రత బాగా పెరిగిపోవడం వల్ల అనేక నష్టాలు సంభవిస్తున్నాయి. అందువల్ల తుఫానులు గతంలో లేనంత ఎక్కువగా, మరింత తీవ్రంగా వస్తున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. సముద్రాలు తీరానికి మరింత చేరువ అవుతున్నాయి. తీరప్రాంతాలు మరింత ఉప్పుకయ్యలుగా మారిపోతున్నాయి. భూతాపంతో పాటు, సముద్ర ఉష్ణోగ్రతలను అదుపు చేయాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అందుకు ఒక సమీకృత విధానం అవసరం అని తెలిపింది. వాతావరణ మార్పు, సముద్రాల ఆమ్లీకరణ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను అన్ని దేశాలకు వివరించి, వాటిని అదుపులో పెట్టాల్సిన ఆవశ్యకతనూ ఈ ఒప్పందంలో భాగం చేసింది. నిజానికి ఇప్పటి వరకు అంతర్జాతీయ జలాల పర్యవేక్షణకు, వాటిలో మానవ కార్యకలాపాల నియంత్రణకు ఒక అంతర్జాతీయ చట్టం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి తీసుకొస్తామంటున్న కొత్త చట్టం ఈ దిశగా ఒక మంచి ముందడుగు అవుతుందన్నఆశాభావాన్ని సమితిలోని 193 దేశాలు వ్యక్తపరిచాయి. చాలా కీలకమైన, సంక్లిష్టమైన సమయంలో ఇలాంటి ఒప్పందం కుదరటం ఒకింత ఊరట కలిగించే అంశమే. 2030 నాటికల్లా ఈ భూగ్రహంలోని భూమి, సముద్రాల్లో కనీసం 30% భాగాన్ని కాపాడుకోవాలని గత సంవత్సరమే లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక రాయబారి పీటర్ థామ్సన్ గుర్తుచేశారు.ఆ లక్ష్యాన్ని సాధించాలంటే బీబీఎన్ జే లాంటి ఒప్పందాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ భూగ్రహం మీద ఉన్న మొత్తం సముద్రాల్లో మూడింట రెండు వంతులు అంతర్జాతీయ జలాలే. అందువల్ల వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఐరాసలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క దేశం మీదా ఉంది. సముద్రాల చట్టం పేరుతో ఒక చట్టాన్ని మూడు దశాబ్దాల కిందటే తీసుకొచ్చారు. కానీ అది కేవలం దేశాల పరిధిలో ఉన్న సముద్రాలకు మాత్రమే వర్తిస్తుంది తప్ప అంతర్జాతీయ జలాలను ఏమాత్రం నియంత్రించలేదు. ఇప్పుడు అంతర్జాతీయ జలాల ఒప్పందం కుదరడంతో ఆ లోటు కొంత వరకు తీరినట్లవుతోంది. మనం పీల్చుకునే ఆక్సిజన్ ను,కొన్ని కోట్లమందికి అవసరమైన ఆహారాన్నిఅందించే సముద్రాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఐక్యరాజ్యసమితిలో సముద్రాలు, అంతర్జాతీయ పర్యావరణ, శాస్త్రీయ వ్యవహారాల సహాయ కార్యదర్శి మోనికా మెడినా చెబుతున్నారు. వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను, వాతావరణంలో ఎక్కువగా ఉండే వేడిని గ్రహించుకోవడం ద్వారా సముద్రాలు ప్రాణికోటికి ఎంతగానో సహాయపడుతున్నాయి. అయితే, కొన్ని దేశాలు ఈ కొత్త ఒప్పందానికి మోకాలొడ్డుతున్నాయి. ముఖ్యంగా రష్యా లాంటి అగ్రరాజ్యాలు అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెబుతున్నాయి. మరో పెద్ద దేశమైన చైనా మాత్రం చర్చల్లో చురుకుగా పాల్గొంటూ, వీలైనంత వరకు ఈ ఒప్పందం త్వరగా కుదిరేలా చూస్తోంది. ఈ ఒప్పందం ఏదో ఒకటి రెండు దేశాల కోసం కాదని, ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలకూ… ఇంకా చెప్పాలంటే యావత్తు మానవాళికి మేలుచేసేదని గుర్తించినప్పుడే అది పూర్తి స్థాయిలో ఫలవంతం అవుతుంది. ఈ దిశగా దేశాలన్నీముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది.
- సమయమంత్రి చంద్రశేఖర శర్మ