Sunday, November 24, 2024
Homeహెల్త్Peel magic: 'తొక్కలో' టీ తాగారా? దానిమ్మ తొక్కలతో ఆరోగ్యం

Peel magic: ‘తొక్కలో’ టీ తాగారా? దానిమ్మ తొక్కలతో ఆరోగ్యం

దానిమ్మ గింజలే కాదు దానిమ్మ పండు తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఈ పండు గింజల్లోనే కాదుతొక్కల్లో సైతం యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో కూడా దీని తొక్కలు బాగా పనిచేస్తాయి. అంతేకాదు జలుబు, దగ్గులను నివారిస్తాయి. చర్మ సంబంధిత సమస్యల పరిష్కారానికి కూడా దానిమ్మ తొక్క బాగా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా కూడా ఈ పండు తొక్కలు కాపాడతాయి. కీర, యాపిల్, సపోటా లాంటి పండ్ల తొక్కల్లో పీచు పదార్థాలు,ప్రొటీన్లు, పోషకాలు ఎన్నో ఉంటాయి. అలాగే దానిమ్మ పండు తొక్కల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలపై దానిమ్మ పండు తొక్కలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.

- Advertisement -

దానిమ్మ పండు తొక్కలను సూర్యకాంతిలో బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాత ఎండిన ఆ తొక్కలను మెత్తటి పొడిలా చేసుకుని ఒక జార్ లో పోసుకుని భద్రపరచాలి. ఈ పొడిని మనం తినే ఆహారపదార్థాలలో ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు చర్మ సౌందర్యానికి దానిమ్మ తొక్కల పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిమ్మ పండులో ఖనిజాలు, పోషకాలు, పలు విటమిన్లు, పీచుపదార్థాలు, ఐరన్, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో ఈ పండు రసం తాగినా, గింజలు తిన్నా శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. శరీర రోగనిరోధక వ్యవస్థను దానిమ్మ బలోపేతం చేస్తుంది. దానిమ్మ గింజల్లో చాలా తక్కువ కాలరీలు ఉంటాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఈ పండులో తక్కువ. రక్తంలోని షుగర్ ప్రమాణాలను నియంత్రిస్తుంది.

ఈ పండు గింజలను రోజూ తినడం వల్ల శరీరం బరువు పెరగదు. దానిమ్మ తొక్కలు లావుగా ఉంటాయి కాబట్టి ఈ పండు తొక్క వల్ల ప్రయోజనాలేమీ ఉండవని చాలామంది భావిస్తారు. కానీ పలు అధ్యయనాల్లో దానిమ్మ తొక్కల వల్ల పొందే లాభాలు ఎన్నో అని తేలింది. న్యూట్రాస్యుటికల్, కాస్మొటిక్ ఉత్పత్తుల్లో దానిమ్మ తొక్కల నుంచి తీసిన పొడిని వాడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే దానిమ్మ గింజల్లో ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో దానిమ్మ తొక్కల్లో కూడా అంతే స్థాయి ఆరోగ్య లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ముందరే చెప్పినట్టు శరీరంలోని మలినాలను పోగొట్టడంలో దానిమ్మ తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. తాజా దానిమ్మ తొక్కలను నీళ్లల్లో బాగా కడిగి వాటిని మంచినీటిలో కాసేపు ఉడికిస్తే అందులోని ఎక్స్ ట్రాక్స్ట అన్నీ నీటిలోకి ఇంకుతాయి. దాన్ని నిమ్మకాయలో కలిపి చిటికెడు ఉప్పు అందులో కలిపి రోజంతా దాన్ని తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.

ఈ పండు తొక్కల్లో డిటాక్సిఫికేషన్ కు కావలసిన యాంటాక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి గాలి చొరబడని సీసాలో పోసి ఫ్రిజ్ లో భద్రపరచుకోవాలి. ఒక టీ స్పూను దానిమ్మ తొక్కల పొడిని అరటీస్పూను తెనెలో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. ఇది అన్ని వయసు వారికీ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతులో ఇన్ఫెక్షన్ పై ఈ పొడి బాగా పనిచేస్తుంది. కారణం ఈ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఎలర్జిక్ గుణాలు పుష్కలంగా ఉండడమే. దానిమ్మ తొక్కలను బాగా కడిగి మెత్తగా రుబ్బాలి. ఆ పేస్టుకు కలబంద గుజ్జు, రోజ్ వాటర్, కొద్దిగా పెరుగును కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాకును వారానికి రెండుసార్లు ముఖానికి పట్టించుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. దానిమ్మ తొక్కలు స్కిన్ టెక్స్చర్ ను పరిరక్షిస్తాయి. అంతేకాదు చర్మం పొడారిపోకుండా, ముడతలు పడకుండా ఉంచుతుంది. తొక్కల్లోని యాంటి ఇన్ఫెక్టివ్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాక్నే, మొటిమల పాలబడకుండా కూడా దానిమ్మ తొక్కలు కాపాడతాయి. పైన చెప్పిన దానిమ్మ తొక్కల ప్యాకును వెంట్రుకలకు కూడా రాసుకోవచ్చు. శీతాకాలంలో వారానికి ఒకసారి ఈ ప్యాక్ ను వెంట్రుకలకు పట్టిస్తే చుండ్రు సమస్య ఉండదు. జుట్టు రాలిపోదు.

దానిమ్మ తొక్కలతో టీ చేసుకుని తాగితే కూడా ఎంతో మంచిది. దానిమ్మ తొక్కల పొడి ని వేడి నీళ్లల్లో వేసుకుని తాగొచ్చు. లేదా టీ పొడితో కలిపి నీళ్లల్లో ఉడకబెట్టి టీ చేసుకుని తాగొచ్చు. ఈ టీని పొద్దున్న తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుంది. దానిమ్మ తొక్కల పొడి ప్రొబయోటిక్ గా పనిచేసి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బిపి, షుగరు, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి సంబంధ ఆరోగ్య సమస్యలకు కూడా దానిమ్మ తొక్కల పొడి ఎంతో బాగా పనిచేస్తుంది. ఒక గ్లాసు వేడి నీళ్లల్లో టీస్పూను దానిమ్మ తొక్కల పొడి వేసి కలిపి ఆ నీటిని రోజూ ఉదయం లేచిన వెంటనే తాగితే మంచిది. దానిమ్మ తొక్కల్లోని థెరపిటిక్ గుణాల వల్ల జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గర్భిణీలకు కూడా దానిమ్మ తొక్కలు ఎంతో మంచిని చేస్తాయి. వీటిల్లోని పోలీఫెనొలిక్, యాంటాక్సిడెంట్ పదార్థాలు గర్భిణీల కడుపులోని పిండానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సిలు కూడా పిండానికి అందుతాయి.

జీర్ణసంబంధ సమస్యలు ఎదురవకుండా ఉండేందుకు గర్భిణీలు రోజూ వీటిని తీసుకోవచ్చు. కాబోయే తల్లులకు వెంట్రుకలు రాలిపోకుండా, చర్మం దెబ్బతినకుండా ఉండడానికి దానిమ్మ తొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే దానిమ్మ గింజలే కాదు దానిమ్మ తొక్కలను కూడా డైట్ లో భాగం చేసుకోవచ్చంటున్నారు పోషక నిపుణులు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News