Tuesday, October 1, 2024
Homeఓపన్ పేజ్Engineer's day: జయహో భారతరత్న విశ్వేశ్వరయ్య

Engineer’s day: జయహో భారతరత్న విశ్వేశ్వరయ్య

భారతదేశం కన్న అతి గొప్ప మేధావులలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. భారతదేశ విద్యా రంగం, ఇంజనీరింగ్‌ రంగం ఈరోజు ఇంత గణనీయమైన అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమైనది. 1861 సెప్టెంబర్‌ 15న జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వ రయ్య కర్ణాటక రాష్ట్రానికి పితామహుడుగా గుర్తింపు పొందినవాడు. ఆయన పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. అందుకే ఆయనకు తెలుగు రాష్ట్రాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది. దానికి గుర్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డును డిజైన్‌ చేసి ఇచ్చారు. అంతేకాక ఇక హైదరాబాద్‌ పత్తర్‌ ఘాట్‌ నిర్మాణానికి డిజైన్‌ చేశారు.
భారతదేశంలోని అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులకు తన అసమాన ప్రతిభా పాటవాలతో సలహాలు సూచనలు చేసి దేశానికి ఎంతో మేలు చేశారు. ఈ రోజు మనం చూస్తున్న భారతదేశ నీటి ప్రాజెక్టు గాని, విద్యుత్‌ ప్రాజెక్టు గాని ఇతర ఖనిజ వనరులకు సంబంధించిన ప్రాజెక్టులను రూపకల్పన చేయడంలో ఆయన మార్గదర్శకాలు ఎంతో ఉపయుక్తమయ్యాయి.
ఒకరకంగా భారతదేశ ఇంజనీరింగ్‌ రంగానికి భీష్ముడి వంటి వాడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్‌ 15న ఇంజనీర్స్‌ డేను జరుపుకుంటున్నాం. ముఖ్యంగా 1917లో బెంగళూరు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించినది ఆయనే.
ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ని స్థాపించటం, యూనివర్సిటీ ఆఫ్‌ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్‌ కాలేజ్‌ని స్థాపించి భావి భారత ఇంజనీర్లను తీర్చిదిద్దిన ఘనత కూడా విశ్వేశ్వరయ్యదే. ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఎదురొడ్డి భారత ప్రజలకు తన మేధో సంపత్తితో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి కావలసిన ప్రాజెక్టులను రూపకల్పన చేసి దేశానికి ఎంతో మేలు చేసినవాడు.
విశ్వేశ్వరయ్య గారు రూపొందించిన కృష్ణ సాగర్‌ ప్రాజెక్ట్‌ను కర్ణాటక ప్రజలు దేవాలయంగా భావిస్తారు. ఆ ప్రాజెక్టు ద్వారా కర్ణాటక రాష్ట్ర రైతాంగం చిరస్మరణీయమైన మేధావిగా ఆయనను గౌరవిస్తాయి. నీటి వనరుల లభ్యత నదీ ప్రవాహానికి తగినట్టుగా ఎక్కడికక్కడ ఆనకట్టలు నిర్మించి వాటికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నీటి నిల్వ చేయగల తాత్కాలిక చెక్‌ డ్యామ్‌లను రూపకల్పన చేసి నిర్మిం చిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యది.
విశాఖపట్నం నదీ తీరం త్వరగా తీవ్రతకు కోతకు గురికాకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో రక్షణ వ్యవస్థను రూపొందించి ఇచ్చారు దీనికి ఆయనకు అద్భుతమైన కీర్తి వచ్చినది. కర్ణాటకలో నిర్మించిన కృష్ణ సాగర్‌ ప్రాజెక్టు కర్ణాటక ప్రజలకు వరప్రదాయని. ఆసియా ఖండంలో ఇది అతిపెద్ద ప్రాజెక్టు.
భారతదేశం తరఫున ఒమెన్‌లో అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థను రూపొందించి నిర్మాణాన్ని పర్యవేక్షించి సత్ఫలితాలను ఇచ్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రతిభ ఖండాంతరాలకు వ్యాపించింది. భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప సంఘటన ఇది. భారతదేశం కన్న అతి గొప్ప సివిల్‌ ఇంజనీర్లలో అత్యంత మేధావి, దేశభక్తుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను గుర్తించిన భారత దేశం ఆయనకు భారత రత్న పురస్కారాన్ని అందించి తనను తాను గౌరవించుకుంది.
1960లో ఆయన శత జయంతి సందర్భంగా భారతదేశం ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి భారతదేశం అంతా ఇంజనీరింగ్‌ రంగంలో ప్రతి ఒక్క శాఖకు ఆయన కీర్తిని చాటే విధంగా ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది 101 సంవత్సరాలు జీవించిన మోక్ష గుండం1962 ఏప్రిల్‌ 12న తుది శ్వాస విడిచారు. తను ఇంజనీరింగ్‌ ప్రతిభతో భారతదేశ గమనాన్ని దశను దిశను మార్చి భారత రైతాంగానికి ఎనలేని సేవలు చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం ప్రాతః స్మరణీయుడు.

  • అట్లూరి వెంకటరమణ
    9550776152
    (నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News