Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Farmers suicides increasing: కలవరపెడుతున్న రైతు ఆత్మహత్యలు

Farmers suicides increasing: కలవరపెడుతున్న రైతు ఆత్మహత్యలు

అతీవృష్టి, అనావృష్టి, అప్పులతో చితికిపోతున్న రైతులు

దేశంలో అనేక రాష్ట్రాలలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు తాజా గణాంకాలు తెలియ జేస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రులు, అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తేలికగా తీసి పారేయకూడదు. ఆ రాష్ట్రంలో గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మొదటి వారం వరకూ 251 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 1219 మంది వ్యవసాయదార్లు ఆత్మహత్య చేసుకున్నట్టు అనధికార లెక్కలు తెలుస్తోంది. అంతేకాదు, 1996 నుంచి 2019 వరకు 23 ఏళ్ల కాలంలో కర్ణాటకలో 11,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో వ్యవసాయదార్లు ఆత్మహత్యలకు పాల్పడడం ఈ రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమన్నది ఒక్క ఈ రాష్ట్రానికే పరిమితం అనుకుంటే పొరపాటే. 2021లో దేశవ్యాప్తంగా 10,881 మంది రైతులు, రైతు కూలీలు, ఇతర వ్యవ సాయదార్లు ఆత్మ హత్యలు చేసుకున్నట్టు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ క్రైం రికార్డ్‌ వెల్లడించింది. రైతులు ఈ విధంగా మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవడం మొదలు పెట్టడానికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. ఇందులో ముఖ్యమైనవి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు. వరదలు, తుపాన్లు ఒక వైపు, వర్షాభావ పరిస్థితులు మరో వైపు రైతు జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇది కాకుండా, ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు రైతులకు అవసర సమయాల్లో అప్పులిచ్చి, ఆ తర్వాత పీల్చి పిప్పిచేయడం కూడా మరో ప్రధాన కారణం. ఇక దళారులు, రుణభారం గురించి చెప్పనే అక్కర లేదు.
వీటన్నిటి కారణంగా చిన్న, సన్నకారు రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. అనారోగ్యాల పాలవుతున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబాలలో కూడా తీవ్ర స్థాయి సమస్యలు తలెత్తుతుంటాయి. 2022-23 సంవత్సరం నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 21 కోట్ల హెక్టార్ల భూమిలో పంట పండించే అవకాశం ఉండగా కేవలం 11 కోట్ల హెక్టార్లకు మాత్రమే సాగు నీరు అందుతోంది. అంటే, 54.76 శాతం భూములకే సాగునీరు అందుతోందన్న మాట. 2013-14లో అయితే 47.80 శాతం భూమికే నీరు అందేది. గత దశాబ్ద కాలంలో సేద్యపు భూమి శాతం బాగానే పెరిగినప్పటికీ, ఇందులో 19 శాతం భూములు మాత్రమే బిందు సేద్యం, జల్లు సేద్యం వంటి ఇతర సాగునీటి మార్గాలను అనుసరించడం జరుగుతోంది. మిగిలిన భూమంతా పూర్తిగా వర్షాల మీద ఆధారపడి ఉంది. నిజానికి అత్యధిక సంఖ్యాక వ్యవసాయదార్లకు ఈ ప్రత్యామ్నాయ వసతులు అందుబాటులో లేవు.
దేశంలో దాదాపు 60 శాతం జనాభా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పూర్తిగా వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తోంది. ఈ జనాభా అంతా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువగా దెబ్బ తినడం జరుగుతోంది. ప్రతి ఏటా అనావృష్టో, అతివృష్టో తప్పడం లేదు. పంటలు దెబ్బ తినడం అనేది ఆనవాయితీ అయిపోయింది. రైతులు ఎంత కష్టపడి పనిచేసినా ప్రకృతి వైపరీత్యాల కారణంగా వారి శ్రమ వృథా అయిపోతోంది. రైతుల బాగోగులను చూసుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న సంగతి నిజమే. అయితే, వారు పంట నష్టపోకుండా ఉండడానికి, వారికి ఏడాదంతా సరైన జీవనాధారం ఉండడానికి సాంకేతికపరంగా ఒక రక్షణ, భద్రత అవసరం. ఇటువంటివి సాంకేతికంగానే కాకుండా టెక్నాలజీపరంగా, మానసికంగా, సామాజిక కౌన్సెలింగ్‌ ద్వారా కూడా జరగాల్సి ఉంది.
ఒకప్పుడు మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ ప్రారంభించిన ‘జై జవాన్‌-జై కిసాన్‌-జై విజ్ఞాన్‌’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘జై అనుసంధాన్‌’ అనే మాటను కూడా చేర్చి అత్యధికంగా నిధులు మంజూరు చేయడం మంచి విషయమే. నిజానికి, 1965లో అప్పటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రారంభించిన ‘జై జవాన్‌-జై కిసాన్‌’ కార్యక్రమానికి ఇది పొడిగింపు అనేది అందరికీ తెలిసిన విషయమే. వ్యవసాయ రంగంలో సైన్స్‌, టెక్నాలజీలను విస్తృతంగా ఉప యోగించడం వల్ల పంట నష్టం తగ్గడంతో పాటు, రైతులకు జీవనాధారం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. దేశ రక్షణకు ఇస్తున్నంత ప్రాధాన్యం వ్యవసాయానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News