Saturday, November 23, 2024
HomeతెలంగాణHarish Rao: అభివృద్ధికి ప్రతీక పటాన్చెరు

Harish Rao: అభివృద్ధికి ప్రతీక పటాన్చెరు

మంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గం నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో.. బీసీ బందు రెండో విడత, మైనార్టీ బందు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. జీవో నెంబర్ 58, 59 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 65 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మాయ మాటలతో ఆచరణ సాధ్యం కానీ హామీలతో మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దేశంలో రాష్ట్రంలో పేదరికాన్ని పెంచి పోషించిన ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. పేద ప్రజలు ఆకలితో అలమటించినప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్ పార్టీ నేడు గోరుముద్దలు పెడతామంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

- Advertisement -

అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం అవి చేస్తామంటూ ప్రగల్బాలు పలకడం మాని, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు లాంటి విప్లవాత్మక పథకాలను కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మోసపోతే గోసపడుతామని, తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. శరవేగంగా పటాన్చెరు అభివృద్ధి.. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా, మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం గత పది సంవత్సరాలలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ మరియు ప్రజల కోరిక మేరకు నియోజకవర్గంలో కొత్తగా మూడు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్డీవో, కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మూడు మున్సిపాలిటీలకు 55 కోట్ల రూపాయల చొప్పున 165 కోట్ల రూపాయలు, మూడు డివిజన్లకు 30 కోట్లు, 55 గ్రామపంచాయతీలకు 35 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసి వాటి అభివృద్ధికి పునాది వేశామని తెలిపారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డిని మూడోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు అభివృద్ధికి వేలకోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో పటాన్చెరు నియోజకవర్గానికి 10 శాతం స్థానిక కోట కేటాయించాలని ఆయన మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను విడతల వారీగా చివరి లబ్ధిదారుడి వరకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ శరత్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News