Sandhya Devanathan :ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంధ్య దేవనాథన్‌ను నియమించింది. 1 జనవరి 2023 నుంచి ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం మెటా ఆసియా పసిఫిక్ డివిజన్ గేమింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఆమె బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అజిత్ మోహన్ మెటా ఇండియా హెడ్ పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సంధ్య దేవనాథన్‌ను నియమించారు. బ్యాంకింగ్, పేమెంట్స్, టెక్నాలజీ వంటి విభాగాల్లో ఆమెకు 22 సంవత్సరాల అనుభవం ఉంది.
ఇదిలా ఉంటే.. సంధ్య దేవనాథన్ మన ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్ కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 2000 సంవత్సరంలో ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. 2016 నుంచి సంధ్యా మెటాలో పని చేస్తోంది.
సింగపూర్, వియత్నాంలలో మెటా బిజినెస్ అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. గ్లోబల్ బిజినెస్ లీడర్‌గా పేరు సంపాదించుకున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్(ఏపీఏసీ) మార్కెట్‌లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే.. పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ బోర్డులో కూడా పని చేస్తున్నారు. వ్యాపార నిర్వహణ, టీమ్ మేనేజ్‌మెంట్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో సంధ్య దేవనాథన్‌కుఉన్న అనుభవం మెటా సంస్థ భారత్‌లో బలపడేందుకు తోడ్పడుతుందని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ తెలిపారు.
కాగా.. ప్రపంచవ్యాప్తంగా మెటా సంస్థలో పని చేస్తున్న వారిలో సుమారు 11 వేల మందిని తొలగిస్తున్నట్లు సంస్థ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఈ తరుణంలో ఇండియా హెడ్‌గా సంధ్య దేవనాథన్ నియమించడం గమనార్హం.