Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Kommuri: డిటెక్టివ్‌ సాహిత్యంలో మేటి రచయిత కొమ్మూరి

Kommuri: డిటెక్టివ్‌ సాహిత్యంలో మేటి రచయిత కొమ్మూరి

డిటెక్టివ్ యుగంధర్ ఈయన సృష్టే

కొమ్మూరి సాంబశివరావు పేరు గుర్తుకు వస్తే చాలు డిటెక్టివ్‌ నవలలు గుర్తుకు వస్తాయి. డిటెక్టివ్‌ సాహిత్యంతో మమేకం చెందిన అపూర్వ, అపురూప రచయిత ఆయన. తెలుగులో మొట్ట మొదటగా డిటెక్టివ్‌ నవల రాసిన వ్యక్తి ఆయనే. ఆయన తాత ముత్తాతలు సైతం రచనా వ్యాసంగంలో చేయి తిరిగిన వ్యక్తులే. ఆయన తెలుగులో 90కి పైగా నవలలు రాశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గుంటూరు జిల్లా తెనాలిలో 1926 అక్టోబర్‌ 26న జన్మించిన కొమ్మూరి సాంబశివరావు ప్రముఖ తెలుగు సాహితీవేత్త గుడిపాటి వెంకట చలానికి స్వయానా సోదరుడు. గుడిపాటి వెంకట చలం దత్తతకు వెళ్లినందువల్ల ఆయన ఇంటి పేరు మారింది. ఆయన తల్లి పద్మావతి రంగస్థల నటులు. బళ్లారి రాఘవతో కలిసి నాటకాలు వేసేవారు. ఆయన అక్కయ్య వరూధిని ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుకు సతీమణి. ఆయన చెల్లెలు ఉషారాణి నేషనల్‌ బుక్‌ ట్రస్టుకు చైర్మన్‌ గా వ్యవహరించారు.
ఆయన తన 14వ ఏట నుంచే రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. 1957-80ల మధ్య ఆయన తన ప్రధాన రచనలన్నీ చేయడం జరిగింది. ఆయన రచనలను చూసి ప్రముఖ ఆంగ్ల రచయిత ఎడ్గార్‌ వాలెస్‌ సైతం ఎంతో ఉత్తేజితుడయ్యారు. ఆయన రచనలంటే మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు ఎంతగానో ఇష్టపడేవారు. ఆయన మొట్టమొదటి తెలుగు డిటెక్టివ్‌ నవల, థ్రిల్లర్‌ 888 విడుదలైనప్పుడు తెలుగునాట ఒక పెను సంచలనం సృష్టించింది. ఆ నవల ఎందరో డిటెక్టివ్‌ నవలా రచయితలకు ఊతం ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ‘చావు తప్పితే చాలు’ అనే హారర్‌ నవలను కూడా రాశారు. అప్పట్లో అది ఒక ట్రెండ్ గా మారిపోయింది. అది కూడా తెలుగు నాట అనేక మంచి రచయితలకు పథ నిర్దేశనం చేసింది. ‘తెలుగు సినిమా’ అనే పత్రికలో ఆయన సంపాదకుడుగా కూడా పనిచేశారు. తర్వాత ఆయన ‘మంజూష’ అనే సాహిత్య సంచికను సొంతంగా నడిపారు. ఆయన భాష అద్భుతంగా ఉంటుంది. పూర్తి వ్యవహారికంలో, ఆయన పాత్రికేయ భాషలో ఈ పుస్తకాలన్నీ రాయడం వల్ల వీటిని జనం వదిలిపెట్టకుండా చదివేవారు. విచిత్రమేమిటంటే ఈ నవలల ఆధారంగానే అప్పట్లో అనేక డిటెక్టివ్‌ సినిమాలు కూడా వచ్చాయి. డిటెక్టివ్‌ నవలలు రాయడం అనేది ఒక ప్రధాన జీవనాధారంగా కూడా మారిపోయిందంటే అది ఆయన స్ఫూర్తేనని చెప్పక తప్పదు.
ఆయన సాంఘిక నవలలు కూడా రాసినప్పటికీ, ఆయనకు డిటెక్టివ్‌ నవలా రచయితగానే పేరు స్థిరపడిపోయింది. ఆయన మొత్తం మీద 70 డిటెక్టివ్‌ నవలలు రాశారు. ఇరవైకి సాంఘిక నవలలు రాశారు. ఆయన నవలలన్నీ కలిపి పది లక్షలకుపైగా అమ్ముడుపోయి ఉంటాయని ప్రచురణకర్తల సమాచారం. ఆయన రాసిన డిటెక్టివ్‌ నవలల్లో ప్రధాన డిటెక్టివ్‌ యుగంధర్‌, అతని అసిస్టెంట్‌ రాజు పాత్రలు ప్రతివారికీ గుర్తుండిపోతాయి. ఆ పాత్రలను ఆయన ఎంతో హుందాగా మలిచారు. ఇందులో ప్రతి నవలకూ నేపథ్యం మద్రాసు నగరం. ఏ నవల అయినా విరామం లేకుండా ఆసాంతం చదివిస్తుంది. ఆయన 1994లో కన్నుమూశారు. తెలుగు నవలా సాహిత్యాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిన సాంబశివరరావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News