Hardik Pandya : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీస్‌లో ఓడి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 జట్టులో భారీ మార్పులు తప్పవు అంటూ వార్తలు వినిపించాయి. ముఖ్యంగా కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ జట్టును అరంగ్రేటంలోనే గెలిపించిన ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాకు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పందించలేదు. దీంతో ఆ వార్తలకు అప్పట్లో కామా పడింది.
అయితే.. మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. గత కొంతకాలంగా రోహిత్ ఫిట్‌నెస్ సమస్యలతో పాటు గాయాలతో బాధపడుతున్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. విశ్రాంతి పేరుతో కొన్ని సిరీస్‌కు అతడికి రెస్ట్ ఇస్తున్నారు. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లలో జట్టును విజయవంతంగా నడిపించలేకపోవడంతో అతడి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్(వన్డేలు, టీ20)ల్లో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు మొదలు అయ్యాయి.
“పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హిట్‌మ్యాన్‌ను తప్పించి పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ప్రణాళికలు వేసుకున్నాం. ఈ విషయాన్ని పాండ్యాతో కూడా చర్చించాం. అయితే.. దీనికి సమాధానం చెప్పేందుకు మరికొంత సమయం కావాలని అతడు కోరాడు. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఆదిశగా ఆలోచనలు అయితే జరుగుతున్నాయి.” అని ఓ బీసీసీఐ ఉన్నతాధికారి చెప్పినట్లు పలు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కెప్టెన్సీ మార్పు పై ఎలాంటి చర్చ జరగలేదని ఓ అధికారి తెలిపారు. కెప్టెన్సీపై కేవలం సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సదరు అధికారి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో జనవరి 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.