Unmarried Men Protest : దేశంలో పెళ్లి కాని యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉన్నత చదువులు చదవి మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ వారికి వివాహాలు కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన వధువు దొరకడం లేదు. ఏ చోట పరిస్థితి ఎలా ఉన్నా కానీ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అంటున్నారు అక్కడి యువకులు. మాకో అమ్మాయిని వెతికి పెట్టండి మహాప్రభో అంటూ వినూత్నంగా నిరసనలు చేపట్టారు. పెళ్లి కొడులకు గెటప్‌లో గుర్రాలపై కూర్చుని ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడ బైఠాయించారు.
ఈ వినూత్న నిరసన కార్యక్రమం క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. దీనిపై ఆ సంస్థ అధ్యక్షుడు రమేష్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పురుషులకు సరిపడా సంఖ్యలో మహిళల సంఖ్య లేదన్నారు. దీనికి కారణం రాష్ట్రంలో లింగ నిర్థారణ చట్టం సరిగ్గా అమలు కాకపోవడమేనని ఆరోపించారు. దీని వల్లే లింగ నిష్పత్తిలో గణనీయమైన తేడా ఉందన్నారు. మన దేశంలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు.
25 నుంచి 40 ఏళ్ల లోపు పురుషులు చదువుకుని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నా పెళ్లికాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లింగ నిర్థారణ చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. అక్కడి వచ్చిన యువకులు మాట్లాడుతూ తమకు ఓ మంచి వధువును చూసి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ వింత నిరసన వార్త వైరల్‌గా మారింది.