గురివింద గింజకు తన కింద నిలుపు సంగతి తెలియదనే సామెత అమెరికాకు అక్షరాలా వర్తిస్తుంది. తాను తన దేశంలో ఏనాడూ పాటించని పౌర హక్కులు, మానవ హక్కుల గురించి, అల్ప సంఖ్యాక వర్గాల క్షేమం గురించి అది ఏ దేశం వెళ్లినా తప్పకుండా ప్రస్తావిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఆ దేశం ఇదే పనిని జి-20 సమావేశం సందర్భంగా భారతదేశంలో కూడా ప్రస్తావించింది. జి-20 సమావేశాలను పురస్కరించుకుని భారత్ వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం చైతన్యవంతంగా ఉండాలంటే, మానవ హక్కులకు భంగం ఏర్పడరాదని, అల్ప సంఖ్యాక వర్గాలతో సామరస్యం పాటించాలని, పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని బైడెన్ సలహా ఇచ్చారు. నిజానికి, ఆయన ఈ ప్రసంగ పాఠాన్ని అమెరికా నుంచి తీసుకు రాలేదు. అప్పటి కప్పుడు ఈ సలహా ఇవ్వడం జరిగింది. ఆయన ఇదే వ్యాఖ్యలను, అభిప్రాయాలను ఆ తర్వాత హానాయ్ లో కూడా ఉటంకించారు.
అంతకు ముందు మోదీ నివాసంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశానికి పత్రికా ప్రతి నిధులను రాని వ్వకపోవడంపై అమెరికా పత్రికా ప్రతినిధులను శాంతపరచడానికి ఆయన ఈ మాటలు అని ఉంటారు. గత జూన్ నెలలో వైట్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అక్కడి పత్రికా ప్రతి నిధులు మోదీని మైనారిటీల హక్కుల గురించి ప్రశ్న వేశారు. ముఖ్యంగా ముస్లింల హక్కులను గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి ప్రశ్నించారు. మోదీ ఈ ప్రశ్నలకు దీటైన సమాధానం ఇచ్చారు. భారతదేశంలో మైనారిటీల హక్కులకు భంగమేమీ కలగడం లేదని, ఇక్కడ వారు ప్రపంచంలో మరెక్కడా లేనంత పరిపూర్ణమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారని, పత్రికా స్వేచ్ఛకు కూడా భంగమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యమనేది భారతదేశ జన్యువుల్లో ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు. కాగా, భారతదేశానికి వచ్చి, మోదీతో సమావేశమైనప్పుడు మాత్రం బైడెన్ అన్యాపదేశంగానే ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఇది ఇలా ఉండగా, సెప్టెంబర్ 20న భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ పరంగా చర్చించబోతున్నట్టు అమెరికా కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ ప్రకటించింది. ఫలితంగా ఈ అంశం ఒక వేడి వాడి చర్చగా మారబోతోంది. భారతదేశంలో 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న సమయంలో అమెరికాలో ఇటువంటి చర్చ జరగడం గమనించాల్సిన విషయం. అమెరికాలో జరగబోతున్న చర్చ ఇక్కడ పాలక పక్షాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు, ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారబోతోంది. హర్యానాలోని నూహ్ లో ఇటీవల జరిగిన మత ఘర్షణలు, మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింసా విధ్వంసకాండలు వగైరాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో సహా కొన్ని పాశ్చాత్య దేశాలు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం జరుగుతోందని పాలక పక్షం భావిస్తోంది. సమస్యల మూలాలు తెలుసుకోకుండా అమెరికా సలహాలు, సూచనలు చేయడంపై పాలక పక్షం మండిపడుతోంది.
భారతదేశంలో మైనారిటీల హక్కులు, సమస్యల గురించి, అత్యధిక సంఖ్యాకుల ఆధిపత్యం కారణంగా వారు పడుతున్న ఇబ్బందుల గురించి పాశ్చాత్య దేశాల అభిప్రాయాలను అమెరికా కమిషన్ ప్రముఖంగా చర్చించడం జరుగుతుందని ఒక ప్రకటన తెలియ జేసింది. వాస్తవానికి, ఈ కమిషన్ చేయబోయే సిఫారసులు, సూచనలు, వ్యక్తం చేసే అభిప్రాయాల గురించి పట్టించుకోనవసరం లేదనే భారత ప్రభుత్వం భావిస్తోంది. నిజంగా ఏవైనా సమస్యలుంటే తాము అంతర్గతంగా పరిష్కరించుకోగలమని అది ఇదివరకే స్పష్టం చేసింది. ఇక పత్రికా స్వేచ్ఛకు, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు ఎటువంటి భంగమూ జరగడం లేదని ప్రభుత్వం చాలా కాలం కిందటే పాశ్చాత్య దేశాలకు కూడా తేటతెల్లం చేసింది. ఈసారి కూడా ప్రభుత్వం ఇదే స్పష్టం చేసే ఉద్దేశంలో ఉంది.
American commission for international religious freedom: అమెరికా అధ్యక్షుడి అప్రస్తుత ప్రసంగం
కమిషన్ రిపోర్ట్ గురించి పట్టించుకోనవసరం లేదని మన ప్రభుత్వం భావిస్తోంది