IND vs BAN 2nd Test : మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో మామినుల్ హల్ (84) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా 12 ఏళ్ల తరువాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనాద్కత్ రెండు వికెట్లు తీశాడు.
రెండు టెస్టుల మ్యాచ్ సిరీస్‌లో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావించిన బంగ్లాదేశ్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన బెట్టి అతడి స్థానంలో జయదేవ్ ఉనాద్కత్‌ను తీసుకున్నారు.
శాంటో(24), జాకీర్ హసన్(15) బంగ్లా జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 39 పరుగులు జోడించారు. ఈ దశలో విజృంభించిన భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ కు పంపారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షకీబ్ అల్ హాసన్(16), మామినుల్ హాల్(84) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. అయితే లంచ్ అనంతరం తొలి బంతికే షకీబ్‌ను ఉమేశ్ ఔట్ చేశాడు. దీంతో 43 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తరువాత ముష్పికర్ రహీం(26), లిటన్ దాస్(26), మెహదీ మిరాజ్(15) లు ఒకరి తరువాత ఒకరు పెవిలియన్‌కు చేరుకున్నారు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మామినుల్ హల్ ఒంటిరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో తొమ్మిదో వికెట్ రూపంలో ఔటైపోయాడు. ఆ వెంటనే ఖలీద్ అహ్మద్(0)ను అశ్విన్ ఔట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.