Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Gurujada Jayanthi: కాలానికి ముందుమాట..గురజాడ బాట

Gurujada Jayanthi: కాలానికి ముందుమాట..గురజాడ బాట

గురజాడ జయంతి నేడు

గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్‌ 21 – 1915 నవంబర్‌ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి ‘కన్యాశుల్కం‘ నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ‘కవి శేఖర’ అనే బిరుదు ఉంది.
పూర్ణమ్మతో స్త్రీకి పునర్జన్మ
‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణ రసప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’ అంటూ అందచందాల రాశి పోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ. ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించింది.
గిడుగుకు సరి జోడుగా
గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు. (కచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది.1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యా శుల్కం రెండవ కూర్పును 1909లో రచించాడు.
1892లో గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి ముఖ్యుడు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది. 1896లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టాడు. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామ స్వామి శాస్త్రులు అండ్ సన్స్‌, మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చాడు. 1909 ఆరోగ్యం కుదుటపడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరగరాసాడు. 1910లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. 1911లో మద్రాసు విశ్వవిద్యా లయం బోర్డు అఫ్‌ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించాడు
శ్రీశ్రీ మనసులో గురజాడ
కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు‘ ‘కన్యాశుల్కము బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం‘ ‘కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ‘.
గురజాడకు వ్యతిరేకించినవారు
గురజాడ ను వ్యతిరేకించినవారు ప్రధానంగా అతను భావాల విషయంలో కొందరు, సాహిత్యపరంగా అతను వాడుక భాష విషయకంగా మరికొందరు వ్యతిరేకించారు. అతను సంస్కరణలను సమర్థిస్తూ, సాంఘికాంశాల విషయంలో అతని అభిప్రాయాలను వ్యతిరేకించిన వారు భావాల విషయంలో వ్యతిరేకులు కాగా, గ్రాంథిక భాష సమర్థకులు అతన్ని వాడుక భాష విషయంలో వ్యతిరేకించారు.
స్త్రీలకు అగ్రతాంబూలం
‘స్త్రీల కన్నీటి గాథలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవటం కూడా ఓ ప్రధాన కారణమే‘ అని గుర్తించిన గురజాడ, పీడిత కులాల జీవితాల్లో కూడా ఆ సమస్యకున్న ప్రాధాన్యాన్ని గమనించారు. ఆర్థిక స్వాలంబనను కల్పించే ఆధునిక విద్యను వారందరికీ అందించాలని ఆశించారు. అందుకు పనికొచ్చే విద్యా ప్రణాళిక గురించి ఆలోచించారు. పాటక జనాలను అభివృద్ధికి తెచ్చేందుకు పాతబడిన విద్యలు పనికిరావు, వారి స్థితిగతులను చక్కబరచి అభివృద్ధికి తేవడం ప్రజాస్వామిక లక్షణం‘ అనే స్పష్టత ఉంది కాబట్టే ‘ప్రత్యక్ష జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషమ సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఈ వేద విజ్ఞానం ఒక్క పిసరు అక్కరకు రాదు‘ అన్నారు. పాఠ్య ప్రణాళికల్లో మత సంబంధమైన ప్రాచీన సాహిత్యాన్ని బోధించడం వలన యువతరంలో కుల, మతాల సంకుతితవ్వం ప్రబలు తుందని ఆందోళన పడ్డారు.
సాహిత్య వెలుగు జాడ మన గురజాడ
తెలుగువారి అడుగు జాడ మన గురజాడ అప్పారావు ఆధునికాంధ్ర సంస్కరణోద్యమం నేత అక్షర శిల్పుల అభినవ వేమన్న. కవిత్వానికి వెలుగుల రారాజు సంఘ సంస్కరణకు సాహిత్య దర్పణం అక్షరాలను ముత్యాల సరాలుగా మార్చతెలుగు తల్లికి ముత్యాల హారము సమకూర్చెను. నవ్య కవిత్వానికి వేగుచుక్కలా నిలిచి, మూఢ నమ్మకాలను ఎదిరించి సత్యము బోధించి శాస్త్ర జ్ఞానాన్ని సమూలంగా అభ్యసించాలని
వెర్రి మాటలను పక్కన పెట్టాలని చాటి చెప్పే వాడుక భాషలో రచనలు చేసి కన్యాశుల్కంలో ప్రభంజనం సృష్టించి పూర్ణమ్మతో ఆత్మాభిమానం చాటి, కన్యకతో స్త్రీలకు స్థైర్యాన్ని పెంచే దిద్దుబాటుతో కథానికా కల్పనగావించే ముత్యాల సరాలతో చందస్సు సృష్టించి ‘మట్టి కాదు దేశమంటే మనుషుల్ని ప్రేమించి దేశభక్తిని‘ చాటిన నిజమైన దేశభక్తుడు. నూతన సాహిత్యాన్ని సృజించి తెలుగు భాషకు అమరత్వాన్ని అందించి ఆధునికాంధ్ర కవిత్వానికి వెలుగునిచ్చె భాషకు పట్టం కట్టించి భావితరాలను మెప్పించె. సాహితీ సేవలో తరించి గిడుగుకు తోడొచ్చి అక్షరాల ద్రష్ట స్రష్టగా ఖ్యాతి గడించి తెలుగు పదాలకు కొత్త దారి చూపించె వాడుక భాష విలువలు పెంచిన నిగర్వి కొత్తపాతల మేలు కలయికతో నూతన కవితలెన్నో సృజించి నవయుగ వైతాళికుడై వెలుగొందపలుకులో పలుకుబడిని వినిపించెను. సాహిత్యానికి జవసత్వాలు కల్పించి సరికొత్త జీవమును ప్రసాదించెను ఆంగ్లము చదివిన అపర మేధావి సత్యము తెలుసుకున్న సత్యవాది. సంఘానికి కొత్త ఊపిరి పోసెను. అక్షరాలకు అమరత్వము సిద్ధించెను తెలుగు సాహితి చరిత్రలో ఉజ్వల జ్యోతి.. జోహార్లు జోహార్లు గురజాడ అప్పారావు..

  • కొప్పుల ప్రసాద్‌,
    తెలుగు ఉపన్యాసకులు
    9885066235
    (నేడు గురజాడ అప్పారావు జయంతి)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News