Sunil Gavaskar : మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్పినర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన బెట్టడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి టెస్టులో అద్భుతంగా రాణించి 8 వికెట్ల తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న ఆటగాడిని బెంచీకే పరిమితం చేయడం అన్యాయం అని అంటున్నారు. దీనిపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
మొదటి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడిని తరువాతి మ్యాచ్‌కు పక్కన బెట్టడం అస్సలు నమ్మశక్యంగా లేదు. ఇది చాలా దారుణం. ప్రస్తుతం ఇంతకు మించి ఏమీ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా మాట్లాడితే తీవ్రమైన పదాలు ఉపయోగించే అవకాశం ఉంది. తొలి టెస్టులో 20 వికెట్లలో 8 వికెట్లు తీసిన బౌలర్‌ను అలా ఎలా పక్కన బెడతారు..? ఇద్దరు స్పిన్నర్లకు అవకాశం ఉన్నప్పుడు అశ్విన్ లేదా అక్షర్‌లలో ఎవరో ఒకరిని పక్కన బెట్టవచ్చు గదా అని ప్రశ్నించాడు. ఇక పిచ్‌తో సంబంధం లేకుండా రాణించిన బౌలర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోతే అతడి ఆత్మ విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. అని గవాస్కర్ ఓ ఛానల్‌కు కామెంట్రీ చేస్తూ అన్నాడు.
అంతకముందు టాస్ వేసిన తరువాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. కుల్దీప్‌ను పక్కన చాలా కఠినమైన నిర్ణయం. తప్పని సరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జయ్‌దేవ్ ఉనద్కత్‌కు అవకాశం ఇచ్చేందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని రాహుల్ అన్నాడు.