Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్China: బుద్ధి, జ్ఞానం లోపించిన చైనా

China: బుద్ధి, జ్ఞానం లోపించిన చైనా

ముఖం చూపలేక జిన్‌ పింగ్‌ మొహం చాటేశారు

చైనా ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు, ఎలా ప్రవ ర్తిస్తుందో అర్ధం కాని విషయం. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే అని వితండవాదం చేస్తోంది. ఏకంగా స్టాండర్డ్‌ మ్యాప్‌ను విడుదల చేయడం ఆ దేశ పైత్యాన్ని చూపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ లో అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని పదకొండు ప్రాంతాల పేర్లు మార్పు చేయాలనే చైనా చేసిన ప్రయత్నాలను భారత్‌ తిప్పి కొట్టింది. ఎన్నో సార్లు భారత్‌ ప్రాంతాలను తమవే అని చెప్పుకుంటున్న చైనా కు భారత్‌ తో ఎలాగైనా ఘర్షణ పడాలానే ధోరణిలోనే ఉంది. శాంతి, సుస్థిరత అనేవి చైనా చెబుతున్నా అవి బూటకపు మాటలే. భారత్‌ లోని ప్రతిదీ మాదే అనే మాట చైనా అహంకారాన్ని చూపిస్తోంది. ఒకసారి సిక్కిం మాదే, మరోసారి అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే అని అంటోంది. అంతేందుకు మొత్తం భారత్‌ అంతా మాదే అంటే మేలు కదా.! చైనా నాయకులకు భారత్‌ అంటే ఎందుకంతా అలుసో తెలియటం లేదు. ఆసియాలోనే కాక విశ్వవ్యాప్తంగా భారత్‌ ప్రతిభ వెలుగుతుండటం చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఇటీవలే సాంకేతిక రంగంలో కూడా భారత్‌ అపూర్వ విజయం సాధించటం, చంద్రయాన్‌ ప్రయోగం సఫలం కావటం, అగ్రదేశాల సరసన భారత్‌ చేరటం చైనాకు మంట కలిగిస్తున్నట్లు ఉంది. విశ్వంలోని ప్రతిదేశం భారత్‌కు చంద్రయాన్‌ విజయం పట్ల అభినందనలు వెల్లువెత్తుతుంటే చైనా, ఇంకా కొన్ని దేశాలు మౌనంగా ఉండటం దేనికి సంకేతం? జీ- 20 దేశాధి నేతలు భారత్‌కు రావడం, జీ – 20కి భారత్‌ నేత్రుత్వం వహించడం చైనాకు సరిపోవడం లేదు. అందుకే ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ హాజరు కాలేదు. ఇక రష్యా హాజరు కావాల్సింది కాని ఉక్రైన్‌ యుద్ధం పట్ల ఆ దేశం తల మునకలుగా ఉంది. ఈ మధ్య కాలంలో జీ – 20 భారత్‌లో జరగడం దాదాపు దేశాధినేతలు, ప్రతినిధులు హాజరు కావడం భారత్‌ యొక్క సహనశీలతను గుర్తించి, గౌరవించడం అపూర్వం. వారికి ఎప్పుడు ఏ దేశ పర్యటనలోను కలగని ఆనందం, కీర్తి భారత్‌ సందర్శనం ద్వారా లభించింది. సదస్సుకు హాజరు అయిన వారిని భారత్‌ ప్రధాని సాదరంగా ఆహ్వానించడం భారత్‌కే చెల్లింది. భారత్‌ వైభవాన్ని చూసే చైనా అధ్యక్షుడు భారత్‌కు రాలేదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఒక దేశ కూటమిలో ఉన్నప్పుడు కచ్చితంగా ఆ దేశ అధ్యక్షుడు హాజరు కావాలి. అరుణాచాల్‌ ప్రదేశ్‌ గురించి భారత్‌ ఎక్కడ ప్రస్తావస్తుందనే మిషతోనే చైనా అధ్యక్షుడు భారత్‌లో అడుగు పెట్టలేదు. భారత్‌ను ఎలాగైనా ఇరుకున పెట్టాలనే యోచనతోనే చైనా ఉంది.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా భారత్‌ శాశ్వత సభ్యత్వానికి చైనాయే మోకాలొడ్డు. ఆసియాలో మాదే అగ్రాధిపత్యం కావాలనే చైనా కాంక్ష. చైనాకు సరైన బుద్ధి, జ్ఞానం ఉంటే భారత్‌తో సరైన సంబంధాలు ఏర్పరచుకునేది.
జీ-20 సదస్సుకు ముఖం చూపలేక జిన్‌ పింగ్‌ మొహం చాటేశారు అనేది సత్యం. లేకపోతే అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం మావే అనే దైర్యం చైనాకు ఎక్కడ నుంచి వచ్చింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం ఎప్పటి నుంచో భారత్‌ లో అంతర్బాగాలు. అక్కడ భారత్‌ పరిపాలన ఉంది. రాష్ట్ర గవర్నర్లు ఉన్నారు. ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరుగుతున్నాయి. పరిపాలన సవ్యంగా సాగుతున్న దశలో చైనా, అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే అనడం ఎంత దుర్మార్గం. సిక్కిం విషయంలో అలాగే అంటున్నప్పుడు భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దానితో సిక్కిం విషయంలో చైనా వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే అని కొత్త పల్లవి ఎత్తుకుంది. ఇది చైనాకు మాములే అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిఫై భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపితే మాత్రమే చైనా వెనక్కు తగ్గుతుంది. ఒప్పందాలు చేసుకోవడం, నాయకులతో కరచాలనం చేసుకోవడం, ఒప్పందాలు విస్మరించడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికి పంచశీల ఒప్పందం చైనా ఉల్లంగించి భారత్‌ ను నివ్వెర పరచింది. 1954లో చేసుకున్న ఒప్పందం నీరుగార్చింది. పంచశీల ఒప్పందం ఓ చరిత్రత్మక ఒప్పందం అని హిందీ – చీని భాయి భాయి అనే నినాదం ఉభయ దేశాలలోనే కాక ఆఫ్రికా ఆసియా అంతా మార్మోగింది. అయితే పంచశీల ఒప్పందానికి 1962లో తీరని విఘాతం ఏర్పడింది. అప్పుడు చైనా అధ్యక్షుడుగా వున్న మావో సేటుంగ్‌ నాయకత్వంలో భారత్‌ పై సైనిక దాడి చేసింది. ఇలా చైనా దాడి చేయడం విశ్వాన్నే నివ్వెరపరచింది. దాదాపు 17 సంవత్సరాలు భారత్‌ ప్రధానిగా వున్న నెహ్రూ పంచశీల ఒప్పందం చైనా పాటించకపోవడంతో తీవ్ర నిరాశతో క్రుంగిపోయారు. నవ భారత నిర్మాత అయిన నెహ్రు 1964, మే 27 వ తేదీన మెదడులో రక్త నాళాలు పగిలి అకస్మికంగా మృతి చెందాడు. ఏది ఏమైనా చైనా తన వైఖరి మార్చుకోక తప్పదు. సరైన నిర్ణయాలు తీసుకుంటే చైనాను అన్ని దేశాలు గౌరవిస్తాయి.

  • కనుమ ఎల్లారెడ్డి
    93915 23027
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News