కడియం శ్రీహరి, రాజయ్య గురించి చెప్పాలంటే సింపుల్ ..ఉప్పు, నిప్పు.. రాయి, టెంకాయి.. ఇలా చెబితే సరిపోతుందని తెలంగాణ ప్రజలు కామెంట్ చేస్తుంటారు. అలాంటి ఆగర్భ శతృవుల మధ్య రాజీ కుదిర్చారు కేటీఆర్. దీంతో స్టేషన్ ఘన్పూర్ లో గులాబీ జెండా ఎగరటం ఖాయంగా మారిందని గులాబీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చిచేరింది.
స్టేషన్గన్పూర్ లో పార్టీ టికెట్ ప్రకటించిన కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. ఈరోజు ప్రగతి భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ లీడర్లతో జరిగిన సమావేశం అనంతరం రాజయ్య పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు, ఆయన గెలుపు కోసం పాటుపడతానని తెలిపారు. రాజయ్య భవిష్యత్తుకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.