ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి గిరిజనులపై అభిమానంతో, గిరిజన ప్రాంత అభివృద్ధికై మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం తట్టుపల్లి గ్రామ పరిధిలో తన స్థావరం ఏర్పాటు చేసుకొని పూర్తిగా వెనుకబడిన గిరిజన ప్రాంతం అయినా డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కై ఆరాటపడుతూ, ఆరు నెలలుగా ఈ ప్రాంత అభివృద్ధికై కేవలం డబ్బులు ఉంటే సరిపోవని అధికారం కూడా అవసరం అన్న ఒకే ఒక్క కారణంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో గిరిజన రిజర్వు అయిన డోర్నకల్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్న కిసాన్ పరివార్ సంస్థ అధినేత ననావత్ భూపాల్ నాయక్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన “భవిష్యత్తుకు భరోసా” కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడనున్నట్లు తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనట్లయితే ఒంటరిగానైనా అసెంబ్లీ బరిలోకి దిగటం ఖాయమని భూపాల్ నాయక్ అన్నారు. అందుకుగాను “పంచసూత్ర” అనే ఐదు అంశాలతో ప్రచారంలోకి దిగుతానని తెలిపారు. పంచసూత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో రెండు వందల ఉద్యోగాల కల్పనతో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించనున్నట్లు అందులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోనే పెద్ద మండలమైన మరిపెడ మండలంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాలలు నెలకొల్పి ఈ ప్రాంత గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతానని, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పామాయిల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ని రైతులకు పండించిన పంటకు మంచి ధర కల్పించేందుకు ఫ్రూడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య అవసరాల రిత్యా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఈసారి తన గెలుపు ఖాయమని సొంత ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు వచ్చారు.