ఈనెల 30వ తేదీ నుండి ‘జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు’లను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణపై అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ కోఆర్డినేటర్ డా.జఫ్రూళ్ల, జిల్లా పరిషత్ సీఈఓ సుబ్బారెడ్డి, ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ రూపేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలోని 369 విలేజ్ హెల్త్ క్లినిక్ లు, 16 అర్బన్ హెల్త్ క్లినిక్ లు ఇతర ఆరోగ్య కేంద్రాలలో ఈనెల 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల పకడ్బందీ నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జగనన్న సురక్ష క్యాంపుల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా పటిష్ట నిర్వహణకు కృషి చేయాలన్నారు. సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, ఎమ్మెల్హో లు మరియు ఆశా కార్యకర్తలు వాలంటీర్ సహకారంతో ఇంటి ఇంటి సర్వే నిర్వహించి జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్ లు తప్పనిసరిగా పంపిణి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఇంటింటి సర్వేలో సాధారణ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణీలు, బాలింతలు తగిన బరువు లేని పిల్లలను గుర్తించి వైద్య శిబిరానికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అవసరమైన మలేరియా, డెంగ్యూ ఇతర టెస్టింగ్ కిట్లను, మందుబిల్లలను ముందుగానే అందచేయాలన్నారు. ప్రతి ఆరోగ్య శిబిరంలో ఇద్దరు వైద్యాధికారులు, ఇద్దరు స్పెసలిస్ట్ డాక్టర్లు వుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే హెచ్బి పరీక్షలు, షుగర్ పరీక్షలు, బిపి పరీక్షలు, గళ్ళ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతి ఆరోగ్య శిబిరాన్ని ఎంపీడీవోలు, తాసిల్దార్ లు ప్రవేశించి పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా అందించే వైద్య సేవలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వైద్యం కోసం ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి వైద్యులు, సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.