Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP capital change: రాజధాని మార్పుపై మళ్లీ కసరత్తులు

AP capital change: రాజధాని మార్పుపై మళ్లీ కసరత్తులు

విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ సంకల్పించింది

రాజధాని మార్పునకు సంబంధించి విధానపరమైన ప్రకటన చేసిన నాలుగేళ్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దసరాల నుంచి విశాఖపట్నంలో రాజధాని కార్యకలాపాలను చేపట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన వ్యవహారాల రాజధాని, కర్నూలులో న్యాయ వ్యవహారాల రాజధానిని నిర్వహించాలనేది ముఖ్యమంత్రి చిరకాల కోరిక. మొత్తానికి ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని అమలు చేయదలచుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న అమరావతిపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ, విశాఖపట్నం నుంచి రాజధాని బాధ్యతలు నిర్వర్తించాలని జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, రాజ్యాంగ సంబంధమైన మూడు అంశాలు న్యాయపరంగా తేలాల్సి ఉంది.

- Advertisement -

రాజధానిపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఉందా అన్న సంగతి తేలాలి. ఈ విధంగా అధికారాలను పంపిణీ చేయవచ్చా అన్నది కూడా తేలాల్సి ఉంది. అంతేకాక, రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల విషయం కూడా తేలాల్సి ఉంటుంది. అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సాధ్యమైనంత త్వరగా తన నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరడం జరిగింది. అయితే, తాము డిసెంబర్ వరకూ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ దసరాల నుంచే విశాఖపట్నంలో కార్యనిర్వాహక కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించుకోవడానికి కారణం ఏమిటి? రాజధానిగా అమరావతే కొనసాగుతుంది కానీ, విశాఖపట్నం నుంచి మాత్రం అధికారిక కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. ఇందుకు న్యాయస్థానాల నుంచి అభ్యంతరాలు ఉండకపోవచ్చు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయన ఎక్కడి నుంచి
అధికారిక కార్యకలాపాలు ప్రారంభిస్తే అదే రాజధాని అవుతుంది. దీనివల్ల రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మొదటిది- ఈ విశాఖ నగరానికి ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. రెండవది-అధికారాల వికేంద్రీకరణ వల్ల ఎటువంటి ప్రయోజనాలున్నాయో ప్రజలకు తేటతెల్లం చేయడంతో పాటు, ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచారం చేసుకోవచ్చు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఎటూ జరగబోతున్నాయి. ఒక అవినీతి కేసులో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తర్వాత, ఇక ఈ వికేంద్రీకరణ ప్రయత్నాలకు అడ్డువచ్చే వారెవరూ ఉండకపోవచ్చు. అంటే, ప్రతిపక్షాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మరో గేటు కూడా తెరిచారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి విశాఖపట్నంలో కార్యనిర్వాహక కార్యకలాపాలు ప్రారంభం అయిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక్క తప్పటడుగు వేసినా దాని విజయావకాశాలు దెబ్బతింటాయి. అంతేకాక, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలు, ప్రయోజనాలు దెబ్బతింటాయి. రాజకీ యాలకు అతీతంగా ఆలోచిస్తే, ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్న విశాఖపట్నాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ సంకల్పించింది. దీనిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఒక బలమైన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశం లభిస్తోంది. భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా నిధుల కొరత కూడా ఉంది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉన్నప్పటికీ, విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక రాజధానికి సంబంధించిన అధికారిక కార్యకలాపాలను నిర్వహించడం పాలక పక్షానికి అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News