Kaikala : గత కొంతకాలంగా సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ సంవత్సరంలో మరణించారు. కృష్ణ, కృష్ణంరాజు లాంటి స్టార్లు కూడా ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ తీవ్ర విషాదంలోకి వెళ్ళింది.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ నేడు డిసెంబర్ 23 తెల్లవారుజామున మరణించారు. 1935లో కృష్ణ జిల్లా కవుతరం గ్రామంలో జన్మించిన ఆయన 1959లో సిపాయి కూతురు సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమయ్యారు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఆయన దాదాపు 700 సినిమాలకి పైగా నటించాడు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.
2013 నుంచి సినిమాలకి దూరంగా ఉంటున్న ఆయన 2019లో ఎన్టీఆర్ బయోపిక్, మహర్షి సినిమాల్లో కొద్దిసేపు కనిపించి అలరించారు. ఇండస్ట్రీలో అందరితో ఎంతో మంచిగా ఉండేవారు. ఆయన నటనకి నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. యముడి పాత్రలో పలు సినిమాలు చేసి యముడు అంటే నిజంగానే ఇలాగే ఉంటారేమో అనేలా ఆ పాత్రకి వన్నె తెచ్చారు కైకాల. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి మచిలీపట్టణం నుంచి గెలిచారు కూడా. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన మరణం తెలుగు పరిశ్రమకి తీరని దుఃఖం. అయన మరణ వార్త విని పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.