భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఈరోజు 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించగా అందులో ఒకటి కర్నూలుకు చేరుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (కాచిగూడ- యశ్వంత్ పూర్) కు కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఆదివారం కర్నూలు సిటీకి చేరుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (కాచిగూడ- యశ్వంత్ పూర్) కు ఘన స్వాగతం పలికిన వారిలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బివై. రామయ్య, బిజెపి పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ కర్నూలుకు ఈ రైలు రావడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ రైలు ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది అని అన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి వలన కర్నూలు రైల్వే స్టేషన్ ను విమానాశ్రయం లాగా ఏర్పాటు చేశారని , డబల్ లైను ఎలక్ట్రిఫికేషన్ జరుగుతున్నదని , దూపాడు- నంద్యాల మరియు మంత్రాలయం- శ్రీశైలంలకు కూడా కొత్తగా రైలు వచ్చే విధంగా కృషి చేయాలని ఆ విధంగా రైల్వే అధికారులు రిపోర్టులు పంపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ నగరపాలక కార్పొరేటర్లు, రైల్వే స్టేషన్ మేనేజర్, రైల్వే శాఖ సిబ్బంది, ఎన్సిసి విద్యార్థులు, వివిధ పాఠశాల విద్యార్థులు , ప్రజాసంఘాలు తదితరులు పాల్గొన్నారు. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ కు వెళ్లే వందే భారత్ రైలును డోన్ లో బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి బిజెపి నాయకులు స్వాగతించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దాదాపు 34 రైళ్లు భారతదేశం మొత్తానికి నడుస్తున్నాయన్నారు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే మోడీ తప్ప వేరే ఒకరితో సాధ్యం కాదన్నారు, అలాగే మోడీ కి ధన్యవాదాలు తెలియజేశారు.