కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా బాల సాహిత్యంలో కూడా వినూత్న మార్పులను ఆశిస్తూ ఆచరణాత్మకంగా పాటిస్తున్న నేటి తరం బాలసాహితీ మూర్తుల కృషి అభినందనీయం, ఆధునిక పిల్లల ఆలోచన సరళికి తగ్గట్టుగా రచనలు అందించటం అత్యవసరం అన్న వాదనను అక్షరాల ఆచరిస్తున్న కొద్ది మంది రచయితల్లో ఒకరు ‘మా. శ్రీ. రాజు’గా సుపరిచితులైన మాకరాజు శ్రీనివాస రాజు. పాల్వంచ కేంద్రంగా బాలసాహితీ సేవ చేస్తున్న ఆయన తన యావత్ జీవితాన్ని బాల సాహిత్యానికే అంకితం చేయడం ఒక విశేషం.
ఆయన కలం నుంచి ఇటీవల వెలువడిన ‘అమ్మ’ బాలల కథ సంపుటి ఆధునిక పిల్లల ఆలోచన రీతికి అద్దం పడుతుంది. 32 కథలు గల ఈ సంపుటిలో కథలన్నీ ఆధునిక సామా జిక విషయాలకు అద్దం పడుతూ ఆసాంతం చదివించే నైపుణ్యం కలిగి ఉన్నాయి. విషయం పాతదే అయిన బహుచక్కని కథనం వాక్య నిర్మాణం సరళీకరణల సాయంతో కథలన్నీ మళ్లీ మళ్లీ చదవాలి అనే విధంగా ఉన్నాయి,
‘జ్యోతిష్యం’ మొదలు ‘మారిన సోము’ వరకు సాగిన ఈ కథా ప్రస్థానం ఆసాంతం ఆలోచనీయంగా సాగుతుంది, కథల్లో సంప్రదాయ బద్ధమైన హేతువాద దృక్పథం కనిపి స్తుంది. ఈ విధానం నేటి ఆధునిక పిల్లల మనస్తత్వాలకు అత్యంత అవసరం కూడా.
ఒకప్పటి కాలంలో ఆచరించిన జ్యోతిష్యం నేటి కాలంలో అంత అవసరం లేదని మన కృషి చక్కగా ఉంటే ఫలితాలు చక్కగానే వస్తాయి తప్ప మంచి ముహూర్తాలను బట్టి ఫలితాలు రావు అనే విలువైన నిజం రచయిత మా. శ్రీ. రాజు జ్యోతిష్యం కథ ద్వారా నిరూపించారు.
‘అమ్మ లేనప్పుడే అమ్మ విలువ తెలుస్తుంది’ అన్న పాతకాలపు నానుడిని ఆధునిక బాల్యానికి అనువదించి ఎంతో చక్కగా వ్రాసిన కథ ‘అమ్మ’. తమ పేదరికం తనలోనే దాచుకుని తన కొడుకు రాముకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్న గొప్ప తల్లిగా రాములమ్మను అభివర్ణించిన రచయిత, రాము స్నేహితుడు శ్యామ్ ధనికత్వానికి ఆశపడి ఆ ఇంటికి చేరి ఎలాంటి కష్టాలు అనుభవించాడో చెబుతూ ఒకపక్క తల్లి మనస్సు గొప్పతనాన్ని, మరోవైపు సొంతతనంలోని తృప్తిని హాయిని అద్భుతంగా ఆవిష్కరించిన రచయిత రచనా నైపుణ్యం అబ్బురం కలిగిస్తాయి.
ఏదైనా తనదాకా వస్తేనే కానీ దానిలోని కష్టంగాని దాని విలువ గాని తెలియదు అనే సత్యాన్ని అనుభవ పూర్వకంగా ఇంపైన కథనం జోడించి చెప్పారు ‘మారిన పిల్లలు’ అనే కథలో. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే నానుడిని నిజం చేస్తూ సాగిన చక్కని కథ ‘మాట- మంచితనం’ మనిషికి గల మంచి లక్షణాల్లో ఒకటి ‘సహనం’ దాని ద్వారా సాధించే విజయాలు అనేకం, అన్న విషయం తెలుపుతూ రాసిన కథ ‘మంచి మాస్టారు’ జంతువుల కన్నా మానవులు చాలా గొప్పవారు, కానీ వారిలోని ఆ ఉన్నతత్వానికి కారణమైన మేధోసంపతి, బుద్ధి బలం, ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగించి, మానవత్వం చాటుకోకపోతే జంతువుల కన్నా హీనంగా చూడబడతారు అనే చక్కని సందేశాన్ని పంచిన కథ ‘నిర్ణయం’.
చెప్పడం కన్నా ఆచరించడంలోని మాన వత్వం విలువ చాటుతూ అసలైన ఆచరణ ద్వారానే మానవ విలువ పెరుగుతుంది అని చక్కని సందేశం అందించిన ఎంచక్కని కథ ‘ప్రతిజ్ఞ’. స్నేహం విలువ, పరోపకారంలోని అంత రార్థం, దురాశలోని నష్టం, కష్టపడటంలోని ఆనందం, మంచితనానికి లభించే మర్యాద, పనులు వాయిదా వేయడం వల్ల కలిగే అనర్ధాలు, దోపిడీకి వీలు కానీ చదువుల సంపద, ఇలా అనేక సర్వసాధారణ విషయాలను అందమైన కథా వస్తువులుగా స్వీకరించి చక్కని శైలి నిడివి కలిపి అందమైన కథలు అందించిన ఈ నిరాడంబరం బాలసాహితీ రచయిత మా. శ్రీ . రాజుగారు అభినందనీయులు.
ఇలా ప్రతి కథ ఒక ఆధునిక సామాజిక విషయంతో ముడిబడి విలువైన సందేశాలను అందించాయి. కథనంలో సరళత ఉన్న అక్కడ క్కడ కొన్ని గ్రాంధిక పాత పద్ధతి పడికట్టు పదా లు ఉపయోగించడం కాస్త అసంతృప్తిని నింపిన, మొత్తం మీద కథల్లో మంచి నడక మాత్రం తగ్గలేదు. దరిమిల కథల్లోని భాష లోపాలు అంతగా కనిపించలేదు.
సాధారణ అంశాలను అందమైన కథలుగా ఎలా వ్రాయాలో తెలుసుకోవాలి అంటే అందరూ ఈ ‘అమ్మ’ బాలల కథా సంపుటి విధిగా చదవాలి. చక్కటి కథ వస్తువులు గల ఈ సంపుటిని బాలసాహితీవేత్తలతో పాటు కొత్తగా కథలు రాయాలి అనుకునే ప్రతి ఒక్కరు చదవడం అత్యవసరం..
- డా॥ అమ్మిన శ్రీనివాసరాజు
7729883223.