Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Kavitha: మహిళా బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు

Kavitha: మహిళా బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు

మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే అమలు చేయాలి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై ప్రధానమంత్రి నిర్ణయాన్ని వెల్లడించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ కు రూ. 42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన ప్రధాని తెలంగాణను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల సాధన తర్వాత తొలిసారి నిజామాబాదుకు వచ్చిన కల్వకుంట్ల కవితకు బీ కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

ఐటిఐ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. మహిళా బిల్లు ఆమోదం పొంది ప్రపంచంలో ఇతర దేశాల సరసన భారతదేశం నిలబడిందంటే అందుకు బీఆర్ఎస్ పార్టీయే కారణమని స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టడం మర్చిపోయిందని, వాళ్లను బీఆర్ఎస్ పార్టీ నిద్రలేపిందని తెలిపారు. ఈ బిల్లు పై కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా మాట్లాడే పరిస్థితిని బీఆర్ఎస్ తీసుకొచ్చిందని అన్నారు.

ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని, 20 ఏళ్ల కింద కాంగ్రెస్కు ఆ తెలివి ఉంటే అప్పుడే బీసీ , ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం జరుగుతుండేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఆ తెలివి లేదని, అధికారం కోల్పోయిన తర్వాత బీసీలు గుర్తుకొచ్చారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తన స్వప్నమని సోనియాగాంధీ అన్నారని, కానీ అధికారంలోకి రావడం స్వప్నం ఉండవద్దని, తెలంగాణ దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలు, మహిళలు, యువకులు మరింత అభివృద్ధి చెందాలన్న స్వప్నం ఉండాలని సోనియాగాంధీ రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగితే అన్ని వర్గాలు బాగుపడతాయి అన్నది సీఎం కేసీఆర్ స్వప్నమని స్పష్టం చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని తేల్చి చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో గత పది ఏళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుందని, తమ పార్టీ పాలనలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, ఒక చిన్న గొడవ కూడా జరగలేదని చెప్పారు. దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా తెలంగాణలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయి కాబట్టే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయని వివరించారు. అభివృద్ధి ఒకటే కాదు ప్రజలకు ఆత్మగౌరవం ఉండాలన్న ఆలోచన తమ పార్టీదని, అందుకే సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్ కమిటీల పదవుల్లో మహిళలకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క వర్గం గురించి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ చేస్తుంటే ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ వచ్చి తామే అధికారంలోకి వస్తామని అంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం అవడం లేదని అన్నారు. మన గురించి ఆలోచించే మన నాయకుడు సీఎం కేసీఆర్ ను కడుపులో పెట్టుకోవాలని కోరారు. నిజామాబాద్ లో ఎమ్మెల్యే గణేష్ గుప్తా అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనను మరొకసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్ల సాధన తర్వాత తొలిసారి నిజామాబాదుకు విచ్చేసిన ఇందూరు ముద్దుబిడ్డ కల్వకుంట్ల కవితకు స్వాగతం పలికారు నిజామాబాద్ వాసులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News