తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన దీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం చాకలి ఐలమ్మ త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరువు పట్టణంలోని సాకి చెరువు కట్టపై త్వరలోనే ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దీంతోపాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సొంత నిధులతో ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, రజక సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.