IPL Auction 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 వేలం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ పంట పండింది. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్‌హెచ్) జట్టు రూ.13.25 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసింది. అతడిని దక్కించుకునేందుకు మూడు ఫ్రాంఛైజీలు పోటీ పడడంతో రూ.2 కోట్ల ప్రారంభ ధరతో బరిలోకి దిగిన అతడు పది కోట్ల మార్కును దాటేశాడు. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అతడిదే అత్యధిక ధర.
పంజాబ్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను కూడా ఎస్ఆర్‌హెచ్ రూ.8.25 కోట్లకు సొంతం చేసుకుంది. మయాంక్ కోసం బెంగళూరు, హైదరాబాద్ పోటి పడగా చివరకు హైదరాబాద్ దక్కించుకుంది. కేన్స్ విలియమ్సన్ ను రెండు కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అజింక్యా రహానే రూ.50లక్షలకు చెన్నై, ఓడియన్ స్మిత్‌ను రూ.50లక్షలకు గుజరాత్ టైటాన్స్, సికిందర్ రాజాను రూ.50లక్షలకు పంజాబ్, జాసన్ హోల్డర్‌ను రూ.5.75 కోట్లకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.
ఇక వేలంలో 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా తుది జాబితాలో ఆ సంఖ్యను 405 కు కుదించారు. ఇందులో 273 మంది భారత ఆటగాళ్లు ఉండగా, 132 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 87 (విదేశీయులు 30) మందిని మాత్రమే తీసుకునే వీలు ఉంది.