చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్న జేఏసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వంపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చారిత్రకంగా, భౌగోళికంగా అన్ని అర్హతలున్న చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఇచ్చిన సడక్ బంద్ పిలుపు ఉద్రిక్తంగా మారింది.జేఏసీ సడక్ బంద్ పిలుపుతో పలువురు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలrస్ స్టేషనుకు తరలించారు. అయినప్పటికీ సడక్ బంద్ పిలుపు మేరకు అఖిలపక్ష జేఏసీ నాయకులు చేర్యాల పాత బస్టాండ్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు జేఏసీ నాయకులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింప చేసే ప్రయత్నం చేయడంతో పోలిసులకు జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత చెప్పినా జేఏసీ నాయకులు తమ ఆందోళనను విరమింప చేయకపోవడంతో పలువురు జేఏసీ నాయకులను పోలీసులు ఈడ్చుకొని వెళ్లి పోలిస్ వాహనం ఎక్కించి స్టేషనుకు తరలించారు.
ఈ క్రమంలో పోలిసులకు పలువురు జేఏసీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టులు చేయడం సరికాదని, గత ఐదు సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ప్రకటించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ప్రకటించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల ప్రాంత ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.