Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్International translation day: ప్రపంచ మానవాళిని కలిపేది అనువాదమే

International translation day: ప్రపంచ మానవాళిని కలిపేది అనువాదమే

ట్రాన్స్‌లేషన్‌ అన్‌వీల్స్‌, ది మెనీ ఫెసెస్‌ ఆఫ్‌ హుమానిటీ అంశాలతో ప్రచారం

అనువాదం దేశ, భాషల సరిహద్దులను పెకిలిస్తుంది. అనువాదం ప్రపంచ దేశాల ప్రజలను కలుపుతుంది. సమాచార వితరణ వాహనం అవుతుంది. వివిధ వర్గాల ప్రజల సాంస్కృతిక వారసత్వ విజ్ఞాన సంపదల పంపిణీ మాద్యమంగా పని చేస్తుంది. అనువాదం అవగాహనను పెంచుతుంది. అనువాదం అభివృద్ధికి ఇంధనంగా పని చేస్తుంది. పలు భాషలు నేర్చుకోవాలనే తపన పెంచి పోషించేది అనువాదమే. అనువాదం ప్రపంచ శాంతికి ఊతం ఇస్తుంది. రెండు భాషల ప్రజల మధ్య వారధిగా అనువాదకులు నిలుస్తున్నారు. తెలియని భాషను వినడం ఓ అయోమయ సందర్భం. బహు భాషావేత్తల అనువాద రచనలు విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ప్రపంచ దేశాల చరిత్ర, రాజకీయాలు, ఫిలాసఫీ, విభిన్న ఇతర అంశాలను ఆవిష్కరించడానికి అనువాదం ఆసరా అవుతుంది. ఒక భాషలోని అంశాన్ని అర్థవంతంగా, యధాతథ భావంతో మరో భాషలో వర్ణించడమే అనువాద ప్రక్రియ అవుతుంది. భాషా అనువాదం ప్రపంచ జనాభాను ఏకం చేసే ఓ నిశ్శబ్ద భాషా ధ్వని.
ప్రపంచ, దేశవ్యాప్త భాషలు
ప్రపంచవ్యాప్తంగా 7,117లకు పైగా భాషలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా ప్రజలు 23భాషలను మాత్రమే మాట్లాడుతున్నారు. పప్వాగ్వినా దేశంలోని 8 మిలియన్ల ప్రజలు 800లకు పైగా భాషలు, ఇండోనేషియాలో 700లకు పైగా భాషలు మాట్లాడడం చూస్తున్నాం. ప్రపంచంలో అత్యధికంగా 130 కోట్ల మంది చైనీస్‌ భాషను, 90 కోట్లు మాండరిన్‌ భాష మాట్లాడుతున్నారు. భారతదేశంలో 1,599 భాషల్లో పదివేలకు పైగా ప్రజలు మాట్లాడే భాషలు 121 ఉండగా అందులో 22 అధికార భాషలు ఉన్నాయి. భారతంలో దాదాపు 57 శాతం హిందీ, 8.85 శాతం బెంగాలీ, 8.18 శాతం మరాఠీ, 6.7 శాతం తెలుగు, 5.7 శాతం తమిళ్‌ ప్రథమ భాషను మాట్లా డే ప్రజలు ఉన్నారు. సాహిత్యంలో కవిత్వం, నవలలు, కథలు, ఇతర రచనలను ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువా దం చేయడం, తద్వారా వివిధ భాషల సంస్కృతులను, విజ్ఞాన నిధులను తెలుసుకోవడం సర్వసాధారణం అవుతున్నది.
అనువాద అనేక ప్రయోజనాలు
ఒక భాషలోని అంశాన్ని అర్థవంతంగా, యధాతథ భావంతో మరో భాషలో వర్ణించడమే అనువాద ప్రక్రియ అవుతుంది. భాషా అనువాదం ప్రపంచ జనాభాను ఏకం చేస్తున్నది. ‘వివిధ భాషలు/యాసలు మాట్లాడే ప్రపంచ మానవాళిని ఏకం చేయడానికి, వివిధ వర్గాల, భాషల, ప్రాంతాల, ఖండాల, దేశాల ప్రజల మధ్య అవగాహన పెంచడానికి, ఒక భాషలో అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని ఇతర భాషల ప్రజలకు చేర్చడానికి, ప్రపంచ శాంతి పరిరక్షణకు అనాదిగా అనువాద ప్రక్రియలు ఉపయోగపడుతున్నాయి. వివిధ భాషల్లో నిగూఢంగా దాగిన విజ్ఞానాన్ని లోక జనులకు తమ తమ భాషల్లోకి అనువదించి అందించుటలో అనువాదక సాహితీవేత్తలు ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ప్రపంచ మానవాళి మధ్య స్నేహాన్ని పెంచడానికి, సమన్వయాన్ని చిగురింపజేయడానికి, భావ వ్యక్తీకరణకు, శాంతి భద్రతలను నెలకొల్పడానికి, సమగ్రాభివృద్ధికి అనువాదకులు దోహదపడుతున్నారు. భాషా సరిహద్దులను చేధించుకొని మేధో వికాసం, సాంస్కృతిక వైవిధ్యం, సమన్వయ సహకారం, విజ్ఞాన సమాజ స్థాపన, రాజకీయ అభిప్రాయ సేకరణ, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడుకోవడం లాంటి ప్రధాన లక్ష్యాలను అధిగమించడానికి భాషా అనువాదం ఉపకరిస్తున్నది. ఐరాస అధికార భాషలైన అరాబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌, రష్యన్‌, స్పానిష్‌ భాషలకు చెందిన అనువాదకులకు ప్రతి ఏట 30 సెప్టెంబర్‌న ఐరాస తగు సత్కారాలను చేయుట ఆనవాయితీగా మారింది. బహు భాషావేత్తల అనువాద రచనలు విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ప్రపంచ దేశాల చరిత్ర, రాజకీయాలు, ఫిలాసఫీ, విభిన్న ఇతర అంశాలను ఆవిష్కరించడానికి అనువాదం ఆసరా అవుతుంది.
అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య ‘వేదికగా 1953 నుంచి ‘అనువాద దినోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఇటలీకి చెందిన సెయింట్‌ ఫీస్ట్‌ అనే రచయిత గ్రీక్‌ భాష నుంచి లాటిన్‌ భాషలోకి తొలిసారి బైబిల్‌ గ్రంథాన్ని అనువాదం చేయడంతో ఆయన అమరత్వ దినం సందర్భంగా 30 సెప్టెంబర్‌న అంతర్జాతీయ అనువాద దినం(ఇంటర్నేషన్‌ ట్రాన్స్‌లేషన్‌ డే)ను పాటించాలనే ఐరాస తీర్మానంతో 2017 నుంచి ప్రతి ఏటా నిర్వహించబడుతోంది. అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య నిర్ణయం ప్రకారం ‘అంతర్జాతీయ అనువాద దినం – 2023’ నినాదంగా అనేక మానవీయ కోణాలను అనువాదం ఆవిష్కరిస్తుంది (ట్రాన్స్‌లేషన్‌ అన్‌వీల్స్‌, ది మెనీ ఫెసెస్‌ ఆఫ్‌ హుమానిటీ) అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ దినోత్సవ వేదికగా భాషా అడ్డంకులను అధిగమించడం, ఉత్తమ సమాచార వితరణ, వృత్తిపరమైన అవగాహన పెంచడం లాంటివి అనువాద విజ్ఞానం వల్ల ఒనగూరితాయి.
అనువాద రంగంలో ఉద్యోగ అవకాశాలు
బహుభాషా వేత్తలకు ట్రాన్స్‌లేటర్స్‌, పర్యాటక ప్రాంతాల్లో గైడ్స్‌, ఇంటర్‌ప్రిటర్స్‌, ట్రాన్స్‌లేషన్‌ ఎడిటర్స్‌, ట్రాన్స్‌లేషన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్స్‌, ఫ్రీలాన్స్‌ ట్రాన్స్‌లేటర్స్‌, డిప్లొమాటిక్‌ ట్రాన్స్‌ లేటర్స్‌, లీగల్‌/మెడికల్‌/వెబ్‌సైట్‌/లిటరరీ/టెక్నికల్‌ ట్రాన్స్‌ లేటర్స్‌ లాంటి అనేక ఉద్యోగ అవకాశాలు అర్హులకు అందుబాటులో ఉన్నాయి.
అనువాద ప్రక్రియను చిన్నచూపు చూడడం, అనువాదకులకు తగు ప్రాధాన్యాన్ని ఇవ్వకపోవడం మన అజ్ఞానం అవుతుంది. కనీసం రెండు భాషల్లో లోతైన భాషా పరిజ్ఞానం ఉన్నప్పుడే ఉత్తమ అనువాద రచనలు వస్తాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు అనువాద రచనలకు, అనువాదకులకు ఆకర్షణీయ వేతనాలను మాత్రమే కాకుండా ఉత్తమ పురస్కారాలను కూడా అందజేస్తాయి. మనం కూడా మన మాతృభాషతో పాటు జాతీయ భాష హిందీ, అంతరాష్ట్ర భాష ఆంగ్లంలో పరిజ్ఞానాన్ని పొంది కనీసం త్రిభాషావేత్తలుగా పేరు తెచ్చుకుంటూ, ఆ భాషల్లో విడుదలవుతున్న ఉత్తమ రచనలను చదువుతూ విషయ పరిజ్ఞానాన్ని పెంచి పోషించుకుందాం.

  • డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
    9949700037
    (నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News