కొద్ది కాలంపాటు స్థిరంగా ఉన్న ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి చమురు దిగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ప్రధాన చమురు ఉత్పత్తి దారులైన సౌదీ అరేబియా, రష్యా దేశాలు తమ తమ దేశాల్లో చమురు ఉత్పత్తిని రోజుకు 13 లక్షల బ్యారెల్స్ చొప్పున తగ్గించేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అక్టోబర్ నుంచి 75 నుంచి 85 డాలర్లు ఉన్న బ్యారెల్ ధర క్రమంగా పెరగడం ప్రారంభం అయింది. గత నెల నుంచి చమురు ఉత్పత్తిలో కోతలను ప్రారంభించిన ఈ రెండు దేశాలు ఈ పరిస్థితిని డిసెంబర్ వరకూ కొనసాగించే అవకాశం ఉంది. ఫలితంగా ప్రధానమైన బ్రెంట్ ముడి చమురు ధర గత 15వ తేదీ నుంచే 94 డాలర్లు దాటిపోయింది. ఇది 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ప్రారంభమైంది. అయితే, వివిధ దేశాలలోని ప్రధాన బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచేయడంతో, వీటిని చాలాకాలం పాటు కొనసాగించే అవకాశం కూడా ఉండడంతో, ఇది 100 డాలర్లకు చేరుకోకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఈ విధంగా చమురు ధరలు పెరగడం అనేది కొన్ని దౌత్యపరమైన మార్పులు, చేర్పులకు కూడా దారితీస్తోంది. చమురుపై సౌదీ ఆధారపడకుండా చేయడానికి ఉద్దేశించిన విజన్ 2030 కార్యక్రమానికి తాము మరింతగా నిధులు సమకూర్చవలసి వస్తోందని సౌదీ తెలియజేసింది. ఈ వ్యవహారాన్ని చూసి అమెరికా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. తమకు ఒకప్పటి మిత్రదేశమైన సౌదీపై అవసరమైతే ఆంక్షలు విధించడానికి కూడా అది సిద్ధమవుతోంది. కాగా, చమురు ధరలు పెంచడం వల్ల ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమైన నిధులు సమకూరుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత మాదిరిగా ఇవన్నీ భారతదేశానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. గత కొద్ది కాలంగా లాభాలను చవిచూస్తున్న భారతీయ చమురు కంపెనీలు, ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా లాభాలు బాగా తగ్గి అవస్థపడుతున్నాయి. పైపెచ్చు వినిమయోగదారుల పెట్రోల్ వాడకం కూడా తగ్గుతున్నందు వల్ల ఈ కంపెనీలు మరింత డీలాపడడం జరుగుతోంది.
ఇక ఆర్థిక వ్యవస్థ పరంగా ఆలోచిస్తే, దాదాపు 85 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న భారతదేశానికి ఇది ఇబ్బందికర విషయమేనని చెప్పాలి. ఆయిల్ ధరలు పెరుగుతున్నందువల్ల భారత్‌కు దిగుమతి వ్యయం తడిసి మోపెడవుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోవడం ప్రారంభమవుతుంది. దీర్ఘకాలంలో దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న స్థితిలో చమురు ధరలు పెరగడం వల్ల మరింతగా ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ప్రజల నిజాదాయాలు తగ్గుతాయి. అంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీనివల్ల డిమాండ్ పడిపోతుంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం కలగలిసిపోతాయి. ఈ పరిస్థితిని నివారించాలన్న పక్షంలో ప్రభుత్వం ఈ చమురు ధరల పెరుగుదల భారాన్ని పూర్తిగా తనపైనే వేసుకుని ప్రజలకు సాధారణ ధరలకు పెట్రోల్ అందించాల్సి ఉంటుంది. గతంలో ముడి చమురు ధర 60 డాలర్లకు పడిపోయినప్పుడు, దీని మూలంగా వచ్చిన పొదుపు మొత్తాలలో కొద్ది భాగాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రజలకు అందించింది. అంటే, ఇప్పుడు ధరలు పెరిగినా దాని భారాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. నిరుడు గడించిన లాభాలను ఇప్పటి నష్టాలతో సమతూకం చేయాల్సి ఉంటుంది.
Increasing Petro prices: పెట్రోల్ ధరలతో కేంద్రానికి కష్టాలు
ఎన్నికల సీజన్ లో మోడీ సర్కారుకు ఇదో సవాల్