Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Dengue danger: ముంచుకొస్తున్న డెంగ్యూ ప్రమాదం

Dengue danger: ముంచుకొస్తున్న డెంగ్యూ ప్రమాదం

దేశాన్ని వణికిస్తున్న డెంగ్యూ

దేశంలో డెంగ్యూ కేసులు విజృంభించడం ఆరోగ్య వ్యవస్థలను ఉలిక్కి పడేటట్టు చేసింది. వివిధ రాష్ట్రాలు ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేసే పనిలో పడ్డాయి. గత సెప్టెంబర్‌ 17 వరకూ లభించిన సమాచారాన్ని బట్టి, దేశంలో మొత్తం 94,000 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 91 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో కేరళ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 9,770 కేసులు నమోదు కాగా, 37 మరణాలు సంభవించినట్టు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ వ్యాధి క్రమక్రమంగా విజృంభిస్తుండడం గమనించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌ సుఖ మాండవీయా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాలలో ఆరోగ్య వ్యవస్థల స్థితిగతుల గురించి ఆరా తీశారు. నిర్దేశిత మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఈ వ్యాధిని నిరోధించడం, నివారించడం, ఆరోగ్య వ్యవస్థలను పటిష్టపరచడంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్రానికి ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటంటే, వర్షాకాలం, చలికాలాలలో వైరస్‌ లు, అంటు వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్టు తెలిసినప్పటికీ రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేసే ప్రయత్నమేదీ ముందస్తుగా చేయడం లేదు. ఉదాహరణకు, కేరళనే తీసుకోండి. ప్రతి ఏటా వర్షాకాలం, చలికాలాల్లో డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రం ముందస్తు జాగ్రత్తలేవీ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఈ ఏడాది ఈ రాష్ట్రంలో డెంగ్యూ తదితర వైరల్‌ కేసులు అసాధారణంగా పెరిగిపోవడం జరిగింది. 2022లో 4432 కేసులు, 29 మరణాలు నమోదు కాగా, అంతకు ముందు సంవత్సరం 3251 కేసులు, 27 మరణాలు నమో దయ్యాయి. కేరళ ప్రభుత్వం ఈ తీవ్రతను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య పెరుగుతుండడం మరింతగా భయాందోళనలకు గురి చేస్తోంది.
వాతావరణంలో చోటు చేసుకుంటున్న తీవ్రస్థాయి మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడుతుండడం, దానివల్ల దోమల బెడద పెరగడం, ఒక పద్ధతి ప్రకారం లేదా ప్రణాళిక ప్రకారం పట్టణీకరణ జరగకపోవడం, పట్టణాలు, గ్రామాల్లోనే కాకుండా నగరాల్లో సైతం పారిశుద్ధ్యాన్ని జనం పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆరంభ స్థాయిలోనే ఈ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు సకాలంలో చర్యలు తీసు కోవడంలో విఫలమవుతున్నాయి. అంతేకాక, ఈ విషయంలో ప్రభుత్వాలే కాదు, స్థానిక సంస్థలు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం గమనించాల్సిన విషయం. తమ ఆవరణల్లోనే ఈ దోమలు పెరుగుతున్నాయని, తమ చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా లేనందువల్లనే ఈ దోమలు పుడుతున్నాయని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. తమ ఆవరణల్లో దోమలు చేరకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రజల మీద కూడా ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో, చలికాలంలో సరైన చర్యలు తీసుకున్న పక్షంలో ఈ డెంగ్యూ దోమను కొంతవరకైనా నిరోధించవచ్చని అంటువ్యాధుల నిపుణులు అనేక విధాలుగా చెబుతున్నారు. వాస్తవానికి డెంగ్యూ దోమను పూర్తిగా నిరోధించడం అంత తేలికైన విషయం కాదు.
ప్రతి ఏటా అంటువ్యాధులు ప్రబలే కేరళ రాష్ట్రం ప్రజారోగ్య సంరక్షణకు సుశిక్షితులైన నిపుణుల బలగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి, కేంద్రం ఇందుకు అవసరమైన వనరులను, వ్యవస్థలను కల్పించడానికి అనేక పర్యాయాలు ముందుకు వచ్చినప్పటికీ కేరళ నుంచి ఆశించిన స్పందన లభించడం లేదని అధికారులు తెలిపారు. కేరళ తనంతట తానుగా కూడా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దోమలు పెరుగుతున్న ప్రాంతాలనుగుర్తించి, అంటువ్యాధుల నిపుణులు, ఆరోగ్య సంరక్షకులు, ఆరోగ్య సేవల కార్యకర్తలు సమన్వయంతో పని చేయాల్సి ఉంది. రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ప్రకారం, దోమలు పెరుగుతున్న ప్రాంతాలను పట్టించుకోకుండా వదిలేసే పక్షంలో డెంగ్యూ దోమలు మరింతగా బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితిని మొదట్లోనే అడ్డుకోవడానికి ఆరోగ్య సంరక్షణ అధికారులు ఎంత ఆధునిక పద్ధతులను చేపడితే అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News