Covid In China: చైనాలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. చైనాలో జీరో కోవిడ్ విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో కరోనా మహమ్మారి చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్.7 చైనా వాసులకు కంటి మీద కనుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజూ చైనాలో 10 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయని, రోజుకు 5 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లండన్‌కి చెందిన సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అంచనా వేసింది.
ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అంచనా ప్రకారం వచ్చే నెల నాటికి చైనాలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 37 లక్షలకు, మార్చినాటికి ఆ సంఖ్య 42 లక్షలకు చేరే ప్రమాదం ఉంది. అయితే, కరోనా వాస్తవ గణాంకాలను చైనా ప్రభుత్వం దాచిపెడుతోందని మరో ఇంటర్నేషనల్ మీడియా రాసుకొచ్చింది. డిసెంబర్ నెలలో మొదటి ఇరవై రోజులలో ఆ దేశంలో 24 కోట్ల మందికి పైగా కరోనా సోకినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు.. ఈ వారంలో ఒకేరోజు ఏకంగా 3.7 కోట్ల కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ హెల్త్ కమీషన్ నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడైనట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. చైనా నుండి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆగ్రహం తెప్పిస్తుంది. తీవ్రతను బట్టే దాన్ని అడ్డుకొనే అవకాశం ఉండగా చైనా దాగుడుమూతలు ఆడడం ప్రపంచానికే సంకటంగా కనిపిస్తుంది. చైనా ఇప్పటికైనా కచ్చితమైన డేటా వెల్లడించి కరోనా కట్టడికి పరిష్కార మార్గాలు చూపాలని ఇప్పటికే డబుల్యూహెచ్ఓ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.