దేశంలోని న్యాయస్థానాలు ఏటా వేసవి సెలవులు తీసుకోవడం క్రమంగా ఓ వివాదాస్పద అంశంగా మారుతోంది. న్యాయస్థానాలు సెలవులు తీసుకో వాల్సిన అవసరం ఉందా అని మేధావులు, న్యాయ నిపుణులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ప్రశ్నించడం మొదలైంది. న్యాయస్థానాలలో మూడు కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉన్న పరిస్థితిలో న్యాయమూర్తులు నెలల తరబడి సెలవులు తీసుకోవడంలో అర్థముందా అనే ప్రశ్న తలెత్తుతోంది. న్యాయమూర్తులు, న్యాయస్థాన సిబ్బంది ఏడాదిలో మరీ ఎక్కువ రోజులు సెలవులు తీసుకోవడం వల్లే కేసులు ఈ విధంగా పేరుకుపోతున్నాయని అత్యధికులు భావిస్తున్నారు. ఇతర ప్రభుత్వ విభాగా లన్నీ వేసవి కాలంలో కూడా పూర్తి రోజులు పనిచేస్తుండగా, ప్రభు త్వంలోనే భాగమైన న్యాయ స్థానాలకు మాత్రం ఈ ప్రత్యేకత దేనికనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోం ది. వేసవి సెలవులు, పండగ సెలవులు, ప్రత్యేక సెలవులు అంటూ దాదాపు సగం రోజులు న్యాయ స్థానాలు, ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలు మూసేసే ఉంటు న్నాయని, దీనివల్ల అత్యవసర కేసులు సైతం విచారణకు నోచుకోక అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పార్లమెంట్ సభ్యులు కూడా ఈ మధ్య వ్యాఖ్యానించడం జరుగు తోంది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, గత ఏడాది సుప్రీంకోర్టు 193 రోజులు మాత్రమే పనిచేసింది. ఇక హైకోర్టులు సగటున ఏడాదికి 210 రోజులు పని చేస్తున్నాయి. దిగువ స్థాయి కోర్టులు (సబార్డినేట్ కో ర్టులు) మాత్రం సగటున 245 రోజులు పనిచేయడం జరుగుతోంది. విచిత్రమేమిటంటే, సబార్డినేట్ కో ర్టుల్లోని నేర సంబంధమైన కోర్టులు మాత్రం పండగ సెలవుల్లో తప్ప వేసవిలో కూడా పూర్తి కాలం పని చేస్తున్నాయి. న్యాయమూర్తులు ఈ విధంగా దీర్ఘకాల సెలవులు తీసుకోవడం వలస పాలకులు ప్రవేశపెట్టిన సంప్రదాయం. అప్పట్లో ఆంగ్లేయ న్యాయమూర్తులు ఉండేవారు. వారు వేసవి కాలంలో తమ స్వస్థ లాలకు వెళ్లడం కోసం దీర్ఘకాల సెల వులు తీసుకునేవారు. దేశం నుంచి వారంతా నిష్క్రమించినప్పటికీ, వారు ప్రవేశపెట్టిన సంప్రదాయం మాత్రం తుచ తప్పకుండా కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం మనకు లేదు. దీనికి ఎంత త్వరగా స్వస్తి చెబితే అంత మంచిదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కోర్టుల్లో పెరిగిపోతున్న కోట్లాది కేసుల సంఖ్యను తగ్గించాలన్న పక్షంలో న్యాయ మూర్తులంతా దీర్ఘకాల సెలవులకు స్వస్తి చెప్పి, ఎక్కువ గంటలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. దేశంలోని ఇతర ప్రజాస్వా మిక సంస్థల పనితీరుతో పోల్చి చూసినప్పుడు, కోర్టులు మాత్రమే కొన్ని ప్రత్యేక గౌరవాలు పొందడం జరుగుతోందని అర్థమవుతుంది. దేశంలోని చట్టసభలు కూడా దీర్ఘకాల సెలవులు తీసుకుంటున్న మాట నిజమే. అయితే, చట్టసభలకు రోజువారీ కార్యక్రమాలు, విధి నిర్వహణలు ఉండవు. న్యాయ స్థానాలకు ప్రతి రోజూ తప్పనిసరిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దేశంలో డాక్టర్లు కూడా న్యాయమూర్తులు, న్యాయవాదుల మాదిరిగా ఒక వృత్తికి సంబంధిం చినవారే. అయితే, వారు న్యాయమూర్తులు, న్యాయవాదుల మాదిరిగా దీర్ఘకాలం సెలవులు తీసుకోవడం లేదు. న్యాయ వ్యవస్థల తీరుతెన్నుల ఫలితంగా సాధారణ ప్రజానీకం తమ కేసుల పరిష్కారానికి ఏళ్లూ పూళ్లూ నిరీక్షించాల్సి వస్తోంది. ఇది సమర్థిం చాల్సిన విషయం కాదు. దీర్ఘకాల సెలవుల కారణంగా దేశంలోని వ్యవస్థలన్నీ తీవ్రంగా ఇబ్బంది పడడ మే కాకుండా, స్తంభించిపోతున్న పరిస్థితుల్లో న్యాయస్థానాలు మాత్రం సెలవులు తీసుకోవడాన్ని తమ హక్కుగా పరిగణించడం సమంజసంగా కని పించడం లేదు.
అనుకూల వాదనలు
కాగా, న్యాయమూర్తులు దీర్ఘకాల సెలవులు తీసుకోవడాన్ని సమర్థించేవారు కూడా లేకపోలేదు. రోజువారీ కర్తవ్య నిర్వహణలో న్యాయమూర్తులు ఇప్పటికే మోయలేని భారాన్ని తలకెత్తుకుంటున్నారని, ఎక్కువ గంటలు పనిచేస్తుంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విధమైన సెలవులు గాని లేకపోయిన ట్టయితే న్యాయమూర్తులు మానసికంగా, శారీరకంగా దెబ్బతినే అవకాశం ఉందని వారంటు న్నారు. అం తేకాక, న్యాయమూర్తులు సెలవు రోజుల్లో సైతం కేసులను అధ్యయనం చేస్తుంటారని, కేసులకు సంబం ధించిన పుస్తకాలు తిరగేయడం, పరిశోధన చేయడం వంటివి కూడా చేస్తుంటారని కొందరు న్యాయ నిపుణులు తెలిపారు. న్యాయ మూర్తులు నాణ్యమైన తీర్పులు ఇవ్వడానికి ఈ కసరత్తంతా అవసరమని వారు గుర్తు చేశారు. న్యాయమూర్తులు ఎక్కువ గంటలు పనిచేస్తారనేది ఎవరూ కాదనలేని విషయమని కూడా వారంటున్నారు. హైకోర్టు, సబార్డినేట్ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు సగటున రోజుకు 60, 70 కేసులను పరిశీలిస్తుంటారని, నిజానికి ఇంత పెద్ద సంఖ్యలో కేసులను పరిశీలించడం చాలా కష్టమైన విషయమని వారు తెలిపారు.
న్యాయమూర్తులు కోర్టులోనే ఎక్కువ గంటలు పని చేయడం అటుంచి, ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా ఫైళ్లు చూడడం, కేసులను అధ్యయనం చేయడం, వ్యాఖ్యలు రాయడం, చట్టాలను పరిశీలించడం జరు గుతుంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు వారానికి ఐదు రోజులు పనిచేస్తుండగా, సబా ర్డినేట్ కోర్టు న్యాయ మూర్తులు వారానికి ఆరు రోజులు పని చేస్తుంటారు. మొత్తం మీద న్యాయమూర్తుల పనితీరుకు, ఇతర వ్యవస్థలకు చెందిన అధికారుల పనితీరుకు చాలా తేడా ఉంటుందని కొందరు న్యా య కోవిదులు వాదిస్తున్నారు. న్యాయమూర్తులు అటు కోర్టుల్లోనూ, ఇటు ఇళ్లలోనూ కేసులకు సంబంధించిన పనులు చేయాల్సి వస్తుం టుందని, అధ్యయనం, పరిశోధన వగైరాలు వారికి ఎక్కువగానే ఉంటా యని వారు చెబుతున్నారు.
అయితే, దీర్ఘకాల సెలవులు తీసుకునే బదులు, ప్రతి న్యాయమూర్తికీ పని గంటలు, పని భారాన్ని నిర్దేశించాలని, ఇందుకు సుప్రీంకోర్టే నడుం బిగించి, న్యాయ మూర్తులు తలకు మించిన భారాన్ని మోయ కుండా చర్యలు తీసుకోవాలని కూడా న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, న్యాయమూర్తులు రొటేషన్ పద్ధతిలో సెలవులు తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి. దీనివల్ల కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులకు పరిష్కారం దొరకడమే కాకుండా, న్యాయమూర్తులు కూడా పనిభారంతో అవస్థలు పడకుండా ఉండడం సాధ్యమవుతుంది.