Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్Increasing drugs consumption: విస్తరిస్తున్న డ్రగ్స్‌ వినియోగం

Increasing drugs consumption: విస్తరిస్తున్న డ్రగ్స్‌ వినియోగం

యువ జనాభా అత్యధికంగా ఉన్న మనదేశంలో ఈ కల్చర్ పెరుగుతోంది

ప్రపంచంలో మాదక ద్రవ్యాలు వినియోగించేవారిలో సగం మంది ఆసియా దేశాల్లోనే ఉన్నట్టు అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఆసియా దేశాల్లో ప్రతి వంద మందిలో ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలకు బానిసేనని కూడా అవి తెలియజేస్తున్నాయి. ‘ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాలు, నేరాల అధ్యయన సంస్థ తాజాగా అందజేసిన వివరాల ప్రకారం, నైరుతి ఆసియా దేశాలలో 2021లో జరిపిన అధ్యయనం ప్రకారం, ఈ దేశాల్లో మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాల వాడకం ప్రపంచ దేశాలన్నిటికంటే ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లో 3.2 శాతం ప్రజలు మత్తు పదార్థాల సేవనంలో మునిగి తేలుతున్నారు. సహజంగానే, ఇందులో యువత శాతం చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత యువ దేశంగా గుర్తింపు పొందిన భారతదేశానికి ఇది మున్ముందు ఒక సవాలుగా మారబోతోందనడంలో సందేహం లేదు.
భారతదేశ జనాభాలో రెండింట మూడు వంతుల మంది జనాభా 35 ఏళ్ల లోపువారే. రెండింట అయిదు వంతుల జనాభా 13 నుంచి 35 ఏళ్ల లోపువారు. ఈ వయసు వారిలోనే ఎక్కువ మంది మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు అలవాటుపడే అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం కూడా ప్రపంచంలో ఎక్కువ మంది మాదక ద్రవ్యాల వ్యసనపరులు ఈ వయసువారే. భారతదేశం విషయానికి వస్తే, మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన కేసులు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్న కేసులు రోజు రోజుకు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలను దొంగ రవాణా చేసే పద్ధతులు, సరఫరా, పంపిణీ చేసే విధానాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటున్నాయి. ఇటువంటి అక్రమ మత్తు పదార్థాలను సరఫరా, పంపిణీ చేయడానికి ఉద్దేశించిన డార్క్‌ నెట్‌ (ఇంటర్నెట్‌లో భాగం) ను డౌన్‌ లో్‌డ చేసుకోవడం కోసం అవసరమైన ఒక సాఫ్ట్‌ వేర్‌ ఇప్పుడు తేలికగా లభ్యమవుతోంది. దీనికి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరపడం కూడా ఎక్కువవుతోంది. ఇది దర్యాప్తు సంస్థలకు ఒక సవాలుగా పరిణమించింది. దీని ద్వారా ఇంటికే మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి.
ఇందులో కృత్రిమ మాదక ద్రవ్యాలు కూడా విజృంభించడం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మత్తు పదార్థాలను ఉత్పత్తి చేయడం, ఇంటి వద్ద డెలివరీ చేయడం చాలా తేలిక. వీటిని తయారు చేయడానికి గంజాయి, నల్లమందు వంటి పదార్థాల అవసరం ఉండదు. అంతర్జాతీయంగా నిషేధాలు విధించిన, ఆమోదం పొందని పదార్థాలను కూడా వీటి తయారీలో వినియో గించాల్సిన అవసరం ఉండదు. అంతేకాక, వీటి తయారీకి కావలసిన పదార్థాలు, మూలకాలు చాలా సులువుగా మార్కెట్లో లభ్యమవుతాయి. కాగా, మెథాంఫెటామైన్‌ అనే కృత్రిమ మాదక పదార్థం ప్రస్తుతం మార్కెట్లో బాగా వినియోగం అవుతోంది. ఈ పదార్థాన్ని వినియోగదార్లకు చేర్చడానికి, దర్యాప్తు అధికారులు కన్నుగప్పడానికి ఉత్పత్తిదారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రభుత్వాలకు, దర్యాప్తు సంస్థలకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటంటే, ఈ మాదక ద్రవ్యాల ఉత్పత్తిదారులు వీటి వినియోగం కోసం ఎక్కువగా ఉన్నత విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. విద్యాసంస్థల ఆవరణంలో వీటిని విక్రయించడమన్నది యథార్థమనడంలో ఎటువంటి సందేహమూ లేదు. విద్యా సంస్థల వద్ద వీటిని అమ్మడం వల్ల టీనేజర్లు సైతం వీటికి బానిసలవుతున్నారు.
మాదక ద్రవ్యాలను, నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించినా, వినియోగించినా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కఠినంగా శిక్షించే అవకాశం ఉంటుంది. ఇటువంటి వారిని ఈ చట్టం నేరస్థులుగానే పరిగణిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగదారులను నేరస్థులుగా పరిగణించకూడదన్న వాదన ఉంది కానీ, ఆ విధంగా చేయడానికి భారతదేశం ఇంకా సిద్ధంగా లేదు. నిజానికి, ఈ చట్టం వల్ల వినియోగదారుల సంఖ్య తగ్గడం గానీ, వినియోగం తగ్గడం గానీ జరగడం లేదనే అభిప్రాయం ఉంది. ఈ వ్యసనాన్ని తగ్గించడానికి ఔషధాలు, చికిత్సలు అందుబాటులో ఉంటున్నాయి. వీరికి శిక్షలు విధించినంత మాత్రాన వీటి వినియోగం తగ్గుతుందని భావించడం కష్టం. వ్యసనపరులలో చైతన్యం కలిగించడం, అవగాహన కలిగించడం, వీరిని చికిత్సా, కౌన్సెలింగ్‌ పద్ధతుల్లో దారిలో పెట్టడం అన్నది విస్తృతంగా జరగాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News