Liquor Ban: ఏపీలో మద్య నిషేధం ఒక కలగానే మిగిలిపోతుంది. రాజకీయ పార్టీలు తమతమ మేనిఫెస్టోల్లో మద్య నిషేదం అమలు చేస్తామని హామీ ఇస్తూ మహిళా ఓట్లు దండుకుంటున్నారు తప్ప.. మద్య నిషేధంకు ధైర్యం చేయడం లేదు. విభజిత ఏపీలో ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల అధినేతలు మద్యపాన నిషేధాలపై హామీలు ఇస్తున్నా ఆచరణలో అమలు చేయడం లేదు. ఫలితంగా ఏపీలో మద్యం విక్రయాలకు కళ్లెం పడటం లేదు.
ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. ఎన్నికల సమయంలో ఏపీలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పలితంగా మహిళా ఓట్లను అధికశాతం రాబట్టుకోవటంలో సఫలమయ్యారు. వై.ఎస్.జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీలో మద్య నిషేదం అమలవుతుందని అందరూ భావించారు. కానీ ఏపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమీ ప్రకటించలేదు. ఒకవైపు పక్కరాష్ట్రం తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా భారీ ఆదాయం సమకూరుతుంది. దీంతో లోటుబడ్జెట్ కలిగిన రాష్ట్రంలో మద్య నిషేధం అమలు జరిపితే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వం భావించి.. మద్య నిషేధం హామీని పక్కకు పెట్టేసింది.
మద్య నిషేధం అమలు చేయకపోవటంపై ప్రజల నుంచి విమర్శలు ఎదురవ్వడంతో వైసీపీ ప్రభుత్వం.. మద్యం రేట్లు పెంచింది. మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. మద్యం తాగేవారి సంఖ్య తగ్గడం అటుంచితే.. మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడుసైతం మద్య నిషేధంపై ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ.. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు తెచ్చి అధికశాతం మద్యాన్ని కల్లుగీత కార్మికులకు దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలా ఏ పార్టీకూడా మద్య నిషేధంకు ముందుకు రావటం లేదు. అలా చేస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడటంతో పాటు పాలన సాగడమే కష్టంగా మారుతుందని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ లెక్కన చూస్తే.. మాటిస్తే.. మాటతప్పం, మడమతిప్పం అని చెప్పుకొనే నేతలుసైతం మద్య నిషేధంకు సాహసం చేయకపోవటంతో.. మద్య నిషేధం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ కలగానే మిగిలిపోనుంది.