Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్'Mandal days' repeating: మండల్‌ రోజులు మళ్లీ ప్రత్యక్షం?

‘Mandal days’ repeating: మండల్‌ రోజులు మళ్లీ ప్రత్యక్షం?

కులాల కుంపటి రాజుకుంది

బిహార్‌ ప్రభుత్వం ఇటీవల వెలువరించిన కులాధారిత అధ్యయన నివేదిక రాజకీయాల్లో కులాలకు మళ్లీ ప్రాధాన్యం పెంచింది. ఈసారి ఈ అధ్యయన నివేదికను సామాజిక న్యాయం పేరుతో తీసుకురావడం విశేషం. త్వరలో లోక్‌ సభ, శాసనసభ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఈ నివేదికను బయట పెట్టడం వెనుక తప్పకుండా రాజకీయ ప్రాధాన్యాలు ఉండే ఉండవచ్చు. ఈ నివేదికను పరిశీలించిన వారికి సహజంగానే మండల్‌ కమిషన్‌ నివేదిక గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. దీని ప్రభావం ఎన్నికల మీదే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ, పబ్లిక్‌, విద్యారంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తూ 1990లో వి.పి. సింగ్‌ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మండల్‌ కమిషన్‌ నివేదిక దేశ రాజకీయాలను మలుపు తిప్పింది. ఈ మండల్‌ కమిషన్‌ నివేదిక తాజా జనాభా లెక్కల మీద కాకుండా 1931 నాటి జనాభా లెక్కల మీద ఆధారపడింది. బిహార్‌ వెలువరించిన తాజా నివేదిక ప్రకారం, రాష్ట్ర జనాభాల్లో బాగా వెనుకపడిన వర్గాలు (ఇ.బి.సిలు), ఇతర వెనుకబడిన వర్గాలు (ఓ.బి.సిలు) కలిపి 63 శాతం ఉన్నారు. వీరిలో ఇ.బి.సిలు 36 శాతం కాగా, ఓ.బి.సిలు 27.13 శాతం.
దేశంలో మండల్‌ రాజకీయాల ప్రభావం ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందిన యాదవులు, తదితరులు అధికారంలోకి రావడం వల్ల ఈ మండల్‌ రాజకీయాలు మరింతగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇ.బి.సిలకు ప్రాధాన్యం తగ్గి, ఓ.బి.సిలకు ప్రాధాన్యం పెరగడం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాలలో మార్పులు రావడం మొదలైంది. సరికొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడడం మొదలైంది. రాజకీయంగా ఓ.బి.సిల ఆధిపత్యం పెరిగింది. అయితే, ప్రస్తుతం కొత్త అధ్యయనం ప్రకారం ఓ.బి.సిల కంటే ఇ.బి.సిలకు సంఖ్యాబలం ఎక్కువగా ఉందని తేలడంతో ఇ.బి.సిలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. కొన్ని మండల్‌ పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ కలిసి, తాజా పరిణామాలు, పరిస్థితులను బట్టి, ఇటువంటి అధ్యయనాన్ని దేశవ్యాప్తంగా జరపాలని పట్టుబట్టడం ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఇటువంటి కుల ఆధారిత అధ్యయనాలు జరిపే పక్షంలో వివిధ కులాల జనాభా లెక్కలు తేలడంతో పాటు, రిజర్వేషన్‌ వ్యవస్థే మారిపోవడం జరుగుతుంది.
వెనుకబడిన కులాల రాజకీయాలను ముందు వరుసలోకి తీసుకు రావడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా ఈ రిజర్వేషన్‌ కోటా గురించిన ప్రస్తావన వచ్చింది. రిజర్వేషన్‌ కోటాలో కోటా తీసుకురావాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది. వెనుకబడిన తరగతుల్లో ఉప వర్గీకరణ జరగాలంటూ రోహిణి కమిషన్‌ తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం కూడా జరిగింది. కులాల ఆధారంగా జనాభా లెక్కలు సేకరించడం వల్ల కులాల పోరు ప్రారంభం అవుతుందంటూ ఇటువంటి ప్రతిపాదనను బీజేపీ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. ఈ విధంగా జనాభా లెక్కలు సేకరించడం పాలపాపరంగా చాలా కష్టమైన విషయమని, ఇది అతి భారంగా తయారయ్యే వ్యవహారమని కూడా అది సుప్రీంకోర్టుకు వివరించింది. 2013లో సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదికలోని వివరాలను బయట పెట్టడానికి కూడా బీజేపీ ప్రభుత్వం ససేమిరా అంటోంది.
బిహార్‌లో చేపట్టిన కులాధార అధ్యయన నివేదికను బయట పెట్టడానికి కూడా బీజేపీ ప్రభుత్వం నిరాకరించింది. ప్రతిపక్షాలు కులాల ఆధారంగా దేశాన్నిముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్రం వ్యాఖ్యానించింది. దీనివల్ల దేశ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగబోతున్నాయన్నది చెప్పలేం కానీ, ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్షాలకు మాత్రం చేతికి బ్రహ్మాస్త్రం దొరికినట్టుగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News