Sonu Sood : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా చైనాతో పాటు అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సోనూసూద్ సైతం రంగంలోకి దిగారు.
కరోనా మొదటి వేవ్ సమయంలో సోనూ సూద్ చేసిన సేవలు ఎన్నటికి మరిచిపోలేం. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో వలసకూలీను వాళ్ల సొంతూళ్లకు తరలించడంలో సోనూ కృషి అభినందనీయం. ఆక్సిజన్ సిలిండర్లు అందించడంతో పాటు అత్యవసర పేషంట్లకు ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశాడు. జాబ్‌లు కోల్పోయి బాధపడుతున్న వారికి జాబ్‌లు ఇప్పించాడు. వీటి అన్నింటితో పాటు అడిగిన వారికి లేదు అనకుండా సాయం చేసి రియల్ హీరోగా నిలిచాడు. దీంతో సోనూసూద్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది.
మరోసారి దేశంలో కరోనా భయాందోళనలు మొదలైన వేళ తాను ఉన్నానంటూ సోనూసూద్ మళ్లీ ముందుకు వచ్చాడు. తన పాత ఫోన్ నెంబర్ ఇంకా పని చేస్తూనే ఉందని చెప్పాడు. కరోనా సాయం ఎవరైనా తనను సంప్రదించవచ్చునని తెలిపాడు. సాయం అందించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని ట్వీట్ చేశాడు. కరోనా వేరియంట్ విజృంభిస్తుండడంతో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 201 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ప్రస్తుతం 3,397 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. 184 మంది గత 24 గంటల్లో కోలుకున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 98.8 శాతంగా, రోజువారి పాజిటివ్ రేట/ 0.15శాతంగా ఉన్నట్లు పేర్కొంది.