Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Ambati Rambabu: కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం

Ambati Rambabu: కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ పొడిగించడం ఏపీకి ఆమోద యోగ్యం కాదు

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం, జల్ శక్తి తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కొత్త విధివిధానాలు ఇస్తూ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి న్యాయపోరాటం చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి తాము ఒప్పుకోమని మంత్రి అన్నారు. ఇప్పటికే బచావత్ ట్రిబ్యూనల్ అనుసరించి నీటి పంపకాల నిర్ణయాలు ప్రామాణికంగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కు విధి విధానాలు అప్పగించడమేంటని మంత్రి ప్రశ్నించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ పొడిగించడం ఏపీకి ఆమోద యోగ్యం కాదన్నారు. ఇది ముమ్మాటికి అన్యాయమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ 2010లో తుది నివేదిక ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. అయితే ఏపీకి నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్ పీ పై స్టే విధించడం జరిగిందన్నారు. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 89లో నిర్ధేశించారని, మళ్లీ కొత్తగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇది చట్టవిరుద్ధమన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో అన్నదాతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమకు ముఖ్యమన్నారు. నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగే అవకాశమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టామని చెప్పారు. రైతాంగానికి నీళ్లు అందించే విషయంలో రాజీపడబోమన్నారు. న్యాయపోరాటంలో తాము గెలుస్తామన్నారు.

కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్ -2కు మరిన్ని విధి విధానాల జారీకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా ఇప్పటికే కేంద్రాన్ని కోరామని మంత్రి వెల్లడించారు. జలాల విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఏపీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని, న్యాయపరమైన చిక్కులను పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారని మంత్రి తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వేసిన ఎస్ఎల్ పీలు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు.

     మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాలపై వివాదాలు సుదీర్ఘ కాలంగా జరుగుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. 1976లో బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అవార్డు ప్రకారమే రాష్ట్రాలు నీటిని వినియోగం చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన 811 టీఎంసీలలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. నీటి వాటాల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ, ఇరు రాష్ట్రాల సీఎస్ ల మధ్య అంగీకార ఒప్పందం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు రాష్ట్రానికి ఇచ్చిన ప్రతీ నీటి బొట్టును రక్షించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోమని తేల్చిచెప్పారు. ఏపీ, తెలంగాణలకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు తప్పక రావాల్సిందేనన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని తాము ఒప్పుకోమన్నారు. అపెక్స్ కౌన్సిల్ లో సైతం రాష్ట్రం తరపున అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. చట్ట వ్యతిరేక అంశాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అంశాలపై చర్చించడానికే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు మంత్రి మీడియాకు స్పష్టం చేశారు.       

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుంచి ఏపీకి 45 టీఎంసీలు తాగునీటి కోసం కేటాయించడానికి ఇటీవలే కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు.

కార్యక్రమంలో జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్ సీ నారాయణరెడ్డి, రిటైర్డ్ ఈఎన్ సీ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News