Monday, November 25, 2024
Homeహెల్త్Edible Tea cups: ఆమె టీ కప్పుల్లో ఆరోగ్యం

Edible Tea cups: ఆమె టీ కప్పుల్లో ఆరోగ్యం

‘కప్పులోని టీ తాగండి… ఆ కప్పును తినేయండి’. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? జయలక్ష్మిగారు తయారుచేసి అందజేస్తున్న టీ కప్పుల ప్రత్యేకత అదే. ఆమె చేసిన ఈ ఎడిబుల్ కప్పుల్లో కాఫీ తాగొచ్చు..ఐస్ క్రీమ్ తినొచ్చు.. చాట్ తినొచ్చు… చాయ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత యమ్మీగా ఉండే ఆ కప్పును కూడా హ్యాపీగా తినేయొచ్చు. ఆమె తయారుచేస్తున్న ఈ కప్పులు అందరికీ ఆరోగ్యాన్ని పంచుతాయి. పేపరు కప్పుల్లో ఉండే విషతుల్యమైన ప్లాస్టిక్ పదార్థాలు ఈ కప్పుల్లో అస్సలు ఉండవు. అలా పర్యావరణానికి మాత్రమే కాకుండా కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఆరోగ్యకరమైన ‘కప్ స్నాక్’ ను కూడా అందరికీ ఆమె అందిస్తున్నారు. ఇంత మంచి ఆలోచన జయలక్ష్మిగారికి ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…

- Advertisement -

‘‘మాది శ్రీకాకుళం. అక్కడే పుట్టి పెరిగాను. నా చదువు విశాఖపట్నంలో సాగింది. ఇంగ్లీష్, తెలుగు రెండు సబ్జక్టుల్లో డబల్ ఎంఏ చేశాను. విశాఖపట్నంలో ఒక ప్రయివేటు స్కూల్లో టీచరుగా పనిచేసేదాన్ని. మా అమ్మావాళ్లకి జనరల్ స్టోర్ ఉంది. నా సిస్టర్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు. కానీ నా కెరీర్ మటుకు వారందరికీ భిన్నమైన మార్గంలో సాగింది. టీచర్ ఉద్యోగం వదిలి.. టీచర్ గా పనిచేస్తున్న నేను బిజినెస్ లో అడుగుపెట్టడం అనుకోకుండా జరిగింది. 2019లో నా భర్త శ్రీనివాస్ కి సర్జరీ జరిగి ఇంటికి పరిమితమయ్యారు. దాని నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆయన కరోనా పాల బడ్డారు. దాంతో ఇంటిపట్టునే ఉండి ఆయనను చూసుకోవలసి వచ్చింది. చేస్తున్న టీచర్ ఉద్యోగం వదిలేశాను. నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేయకపోవడంతో కుటుంబం నడవడం కష్టమైంది. ఆ సమయంలో మేం ఎదుర్కొన్న క్లిష్టపరిస్థితులే నాలో బిజినెస్ చేయాలన్న ఆలోచనను రేకెత్తించాయి.

ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందన్న దాన్ని తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ను తరచూ శోధించేదాన్ని. అలా పాండిచ్చేరిలో ఎడిబుల్ కప్స్ తయారుచేసే ఒక కంపెనీ గురించి చూశా. దాని డీలర్ షిప్ తీసుకుందామని మొదట ఆలోచన చేశా. కానీ వాటి నాణ్యత గమనించిన నాకు సంత్రుప్తి కలగలేదు. పేపర్ కప్పులు, మట్టికప్పుల గురించి కూడా యూట్యూబ్ లో చూశా. వీటితో పెద్ద ఎత్తున వ్యర్థాలు చేరి పరిసరాలు కాలుష్యమయం అవుతాయనిపించింది. అందుకే పూర్తి దేశీయమైన, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయే పదార్థాలతో ఆరోగ్యవంతమైన ఎడిబుల్ కప్పులు తయారుచేస్తే బాగుంటుందనిపించింది. 2021లో కరోనా మొదటి వేవ్ వచ్చింది.

అప్పుడు కరోనా జాగ్రత్తలు బాగా ఉండేవి. వాటితో పాటు రోగనిరోధకశక్తిని పెంచే ఫుడ్ ఐటమ్స్ కి , పరిశుభ్రతకు బాగా ప్రాధాన్యం పెరగడం, ఒకరు ఉపయోగించిన కప్పులని, వస్తువులను వేరొకరు ఉపయోగించకపోవడం ఇవన్నీ నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. నేనే మంచి నాణ్యతతో కూడిన, ఆరోగ్యవంతమైన, ప్లాస్టిక్ విషపదార్థాలకు తావులేని, కాలుష్యరహితమైన , పర్యావరణ హితమైన ఎడిబుల్ కప్స్ ను తయారుచేస్తే బాగుంటుందనిపించింది.

ఎడిబుల్ కప్పులను మైదా, ఇతర పదార్థాలతో కలిపి కొన్ని కంపెనీలు తయారుచేస్తున్నాయి. అవేమీ నాకు ఆరోగ్యకరంగా అనిపించలేదు. అందుకే ఎడిబుల్ కప్పుల తయారీని ప్రయోగాత్మకంగా చేపట్టాలనుకున్నాను. అందులో భాగంగా విశాఖపట్నంలోని రెసాపువానిపాలెం లో చిన్న యూనిట్ ని ప్రారంభించా. రాగుల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయనిపించింది. అందుకే రాగి, బియ్యప్పిండి కాంబినేషన్ తో ఎడిబుల్ కప్పులు చేయాలని భావించా. నాతో పాటు బీహార్ నుంచి వచ్చిన ఒక అతను పనిచేసేవారు. మేం ఇద్దరం కలిసి మా కప్పులకు చక్కటి రుచి, వాసన, రూపు తీసుకురావడానికి రాత్రి, పగలు ప్రయోగాలు చేస్తూ బాగా కష్టపడ్డాం. మేం ఆశించన రీతిలో ఎడిబుల్ కప్పులు నాణ్యమైన ప్రమాణాలతో, ఆరోగ్యకరమైన, రుచికరమైన రూపుకు రావడానికి రెండు నెలలు పైగా పట్టింది. ఈ కప్పుల తయారీ ప్రయోగాల కోసం 70 వేలకు పైగా డబ్బును ఖర్చుపెట్టాం. మా కప్పుల తయారీలో ఉపయోగించే పదార్థాలు మార్కెట్ లో ఉన్న వాటికన్నా భిన్నంగా, ఆరోగ్యకరంగా ఉండాలని నేను భావించాను.

ప్రధానంగా రాగి, బియ్యప్పిండితో చేసే ఈ కప్పులను రెండు సైజుల్లో అంటే 60 ఎంఎల్, 80 ఎంఎల్ సైజుల్లో మేం తయారుచేశాం. పాండమిక్ సమయంలో ఎంటర్ప్రెన్యూర్ గా నా ప్రయాణం ప్రారంభించాను. నిజం చెప్పాలంటే నాలో ఇలాంటి ఒక ఆలోచన రేకెత్తడానికి కరోనా ప్రధాన కారణమని చెప్పాలి. బయట ఉపయోగిస్తున్న పేపరు కప్పుల్లో కూడా ప్లాస్టిక్ ఉంది. పేపరు కప్పుల్లో ఉపయోగించే హైడ్రోఫ్లోరిక్ లేయర్ ఎంతో విషతుల్యమైంది. దానివల్ల కాన్సర్ వంటి జబ్బులతో ఎందరో చనిపోతున్నారు కూడా. అందుకే జీరో ప్లాస్టిక్ లక్ష్యంగా ఎడిబుల్ కప్పుల తయారీకి పూనుకున్నా. అలా ప్లాస్టిక్ కాలుష్య నివారణకు పూనుకోవాలనుకున్నాను. ఇంకొకటేమిటంటే పేపర్ కప్పుల తయారీ కోసం చెట్లు, అడవులు నరికేస్తారు. అది పర్యావరణానికి ఎంతో దెబ్బ. అందుకే రాగి, బియ్యప్పిండి కలిపి ప్రయోగాత్మకంగా ఎడిబుల్ కప్పులు చేస్తే ఆరోగ్యానికే కాదు మన చుట్టూ స్వచ్ఛమైన పరిసరాలు, చెట్లు, మొక్కలతో నిండిన వాతావరణం నెలకొనడానికి తోడ్పడినదాన్నవు తాననిపించింది. పర్యావరణ పరిరక్షణకు నావంతు క్రుషి చేయగలననిపించింది. అలా శ్రీహర్ష ఎంటర్ ప్రైజెస్ అనే పేరుతో మా కంపెనీని ప్రారంభించా. 2021లో కంపెనీ ప్రారంభించా.

కంపెనీకి దగ్గరలోనే ఒక అవుట్లెట్ పెట్టా. రెండు సంవత్సరాల నుంచి అది సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. జనాల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. అయితే మేం ఇంకా జనాలకు బాగా రీచ్ అవాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే పలువురు మా డీలర్ షిప్ కోసం వస్తున్నారు. రాజమండ్రి, విజయవాడ వంటి వాటి నుంచి ప్రిడీలర్ షిప్పుల కోసం ఆఫర్లు వస్తున్నాయి. బిజినెస్ లాభాల బాట పట్టాలంటే ఐదు సంవత్సరాలపైనే పడుతుంది. మార్కెట్ లో ఈ ప్రాడక్టును నిలబెట్టే దిశగా సక్సెస్ అయ్యాం.

కరోనా టైములో ఇండస్ట్రీలకు అనుమతులు ఇచ్చారు. అలా మా కంపెనీకీ అనుమతి లభించింది. రుణం కోసం ఎన్నో బ్యాంకులను ప్రయత్నించా కానీ ఏవీ లోను ఇవ్వలేదు. చివరకు కెనరా బ్యాంకు వారిచ్చారు. అలా మా కంపెనీ ప్రాణంపోసుకుంది. బ్యాంకు రుణం దొరకడానికి ముందు నా నగలు తాకట్టు పెట్టి ఈ స్నాక్ కప్ తయారీ ప్రయోగాలు చేశాను. బిజినెస్ ప్రారంభించే క్రమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. డిజిటల్ మీడియా, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి వాటి ద్వారా మేం చేస్తున్న ఎడిబుల్ కప్పుల ప్రచార ప్రయత్నాలు చేశా. రాగి, బియ్యప్పిండితో చేసిన ఈ ‘కప్ స్నాక్’ 10 గ్రాముల బరువు ఉంటుంది. కాఫీ, చాక్లెట్, స్ట్రాబెర్రీ, ఏలకులు ఇలా రకరకాల ఫ్లేవర్స్ తో కూడిన టీలను ఈ ఎడిబుల్ కప్పుల్లో ఇస్తున్నాం. చిన్నపిల్లలు, యువత వీటిల్లో ఐస్ క్రీమ్, ఛాట్స్ వంటివి తింటారు. ఇదే పద్ధతిలో ఐస్ క్రీమ్ బవుల్స్, ఛాట్ బవుల్స్ కూడా తయారుచేస్తాం. వీటి తయారీలో ఆర్థికంగా మాకు సహాయపడడానికి ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ముందుకొచ్చింది.

ఆరోగ్యపరంగా, పర్యావరణరిరక్షణపరంగా ఈ కప్పులు ఎంతో ప్రయోజనకారిగా ఉండడంతో సమాజంలోని పలు వైపుల నుంచి మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. ఈ కప్పులు తయారుచేయడానికి రెండు మెషీన్లు కొన్నాను. ఒక్కొక్క మెషీన్ రోజుకు 2000 ఎడిబుల్ కప్పులు తయారుచేస్తుంది. అలా నెలకు 30 నుంచి 40 వేల కప్పులను తయారుచేస్తున్నాం. సంవత్సరానికి పది లక్షల రూపాయల మేర సంపాదించగలుగుతున్నాం. ఈ ఎకో ఫ్రెండ్లీ ఎడిబుల్ కప్పులను రోజుకు నాలుగు వేలు తయారుచేస్తాం. ఎడిబుల్ కప్పులు తయారుచేసేటప్పుడు ప్రారంభంలో చాలా కష్టపడ్డా.

మా ఎడిబుల్ కప్పుల తయారీ క్రమంలో చాలా ప్రయోగాలు చేశాం. ఒక రోజు కప్పు షేపు బాగా వచ్చేది. ఇంకోరోజు తయారీలో పదార్థాల మిశ్రమం సరిగా లేక కప్పులు విరిగి పోయేవి. ఒక్కోసారి ఆ మిశ్రమంలో తీపి ఎక్కువవడం లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. అలా ప్రయోగాలు చేసి చేసి మెల్లగా ఎడిబుల్ కప్పులు ఎంతో నాణ్యంగా, బాగా తయారుచేయగలిగే స్థాయికి చేరుకున్నాం. ఈ కప్పుల తయారీ ఫార్ములా నాకు, నాతో పాటు పనిచేసే వ్యక్తికి మాత్రమే తెలుసు. ఈ ప్రయత్నంలో కుటుంబాన్ని, బిజినెస్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డా. ఇలాంటి ప్రయత్నంలో కుటుంబ సహకారం ఉంటే విజయం తప్పకుండా సాధిస్తాం. నాకు కుటుంబ సహకారం ఎంతో ఉంది కాబట్టే ఈ రోజు నా ప్రయత్నంలో జయం సాధించి వి‘జయ’లక్ష్మిగా నిలబడ్డా..’ అని చెప్పుకొచ్చారామె.

-నాగసుందరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News