సాహితీ లోకంలో ఆయన పేరు వినని వారుండరు. కవి, కథకుడు, విమర్శకుడు కూడా అయిన ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రికి తెలుగు సాహిత్య రంగంలో ఎన్ని వేలమంది అభిమానులున్నారో, ఎన్ని వందల మంది శిష్యులున్నారో చెప్పడం కష్టం. విశాఖ జిల్లా వీరవల్లి తాలూకాలోని వడ్డాదిమాడుగుల గ్రామంలో 1911 ఆగస్టు 29న జన్మించిన ఇంద్రకంటి పూర్తిగా స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి. పైగా ముళ్లబాటలో తన గమ్యాన్ని, తన లక్ష్యాన్ని చేరిన సాహితీవేత్త. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన ఇంద్రకంటికి మొదటి నుంచి పండితుడు కావాలనే కోరిక ఉండేది. ఆయన తండ్రి ఇంద్రకంటి సూర్యనారాయణకు కూడా అదే కోరిక. అయితే, ఆ గ్రామంలో అందుకు తగిన వసతులు లేనందువల్ల సూర్యనారాయణ తన అక్క పార్వతమ్మను సంప్రదించారు. ఆమె తన అత్తవారి ఊరైన కోనసీమలోని పాలనమ్మి గ్రామంలో ఉన్న మంథా నరసింహం అనే సంస్కృతాంధ్ర పండితుడి వద్ద ఇంద్రకంటిని చేర్చింది. ఆయన ఇంద్రకంటి సంస్కృత ఆంధ్ర పాఠాలు చెప్పేవారు. అక్కడ కొంత కాలం కావ్య, నాటక, అలంకారాలు చదువుకుని, 1928లో విజయనగరంలోని మహారాజా సంస్కృత కళాశాలలో చేరారు. అక్కడ ఉభయ భాషా ప్రవీణ పూర్తిచేసుకుని, అక్కడి నుంచి వచ్చేశారు.
నిజానికి ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి సంప్రదాయ విద్యలే ఎక్కువగా చదువుకున్నప్పటికీ పాశ్చాత్య భావాలే ఆయనలో ఎక్కువగా కనిపించేవి. ఆయన సంస్కృతాంధ్ర సాహిత్యాలతో పాటు ఆధునిక సాహిత్యాన్ని కూడా కాచి వడబోశారు. తాను చదువుకుంటున్న మహారాజా కళాశాలలో ఆయన చర్చా కార్యక్రమంలో పాల్గొని, ‘ఆధునిక కృతులు-తద్భిన్నాభిప్రాయములు’ అనే అంశం మీద అనర్గళంగా ప్రసంగించారు. అక్కడ ఈ మేరకు ఒక పరిశోధన వ్యాసాన్ని కూడా సమర్పించారు. ఈ వ్యాసాన్నే ఆ తర్వాత ఆయన 1930లో ‘భారతి’ సాహిత్య మాస పత్రికలో కూడా ప్రచురించారు. అదే ఇంద్రకంటి తొలి విమర్శనా వ్యాసం. 1929లోనే ఆయన ‘స్మృతికణాలు’ అనే కావ్య ఖండికను భారతిలోనే ప్రచురించడం జరిగింది. అది ఆయన తొలి పద్య రచన. ఆయన రాసిన ‘గుఱ్ఱం’ అనే కథానికల పుస్తకం ఆయన తొలి కథా సంపుటం. ఆ గ్రంథం లభ్యం కావడం లేదు.
ఇక ఆ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు 1931లో మదన్‌మోహన్ మాలవీయా అరెస్టుకు నిరసనగా జరిగిన ఉద్యమంలో ఆయన పాల్గొనడంతో ఆయనను కళాశాల నుంచి బహిష్కరించడం జరిగింది. దాంతో ఆయన అక్కడి నుంచి బయటపడి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు వెళ్లి అక్క ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలో చివరి సంవత్సరం చదువు పూర్తి చేసుకుని, 1932లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. రాజమండ్రి వెళ్లి అక్కడ దేశబంధు దువ్వూరి సుబ్బమ్మ నడిపే స్త్రీ సదనంలో అధ్యాపక వృత్తిలో చేరారు. అక్కడ ఆయనకు సాహితీవేత్తలెందరో పరిచయమయ్యారు. ఆ సాహితీ వాతావరణంలో ఆయన కొనసాగుతూ, ఆనాటి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు, పద్యాలు, కథలు రాయడం ప్రారంభించారు. అక్కడే ఆయన సంస్కరణల వైపు కూడా మళ్లడం జరిగింది. 1934లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో వివాహమై, అక్కడే బోర్డు నేషనల్ హైస్కూలులో సంస్కృతాంధ్ర పండితుడిగా ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకు అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, భమిడిపాటి, కాటూరి వంటి సాహితీవేత్తలతో పరిచయం అయింది.
ఆయన అక్కడ భాస, కాళిదాసు, భవభూతి వంటి సంస్కౄత కవుల గురించి, నన్నయ, శ్రీనాథుడు వంటి ఆధునికాంధ్ర కవుల గురించి విశేషంగా ప్రసంగాలు చేశారు. ఆధునిక సాహిత్య ప్రచార ఉద్యమాలలో భాగంగా ఆయన దేశమంతటా తిరిగి ప్రసంగాలు చేయడం జరిగింది. రేడియో నాటకాలు, గీతాలు, కథలు, వ్యాసాలు, పద్య ఖండికల్లో ఆయన అచిర కాలంలోనే సాహితీవేత్తగా సుప్రసిద్ధులయ్యారు. బ్రహ్మ సమాజం, కాల్పనికోద్యమం, అభ్యుదయవాదం వంటి వాటి ప్రభావం ఆయనమీద బాగా పడింది. 1940లో రాసిన ‘దాక్షారామం’ అనే పద్యఖండిక ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆయనను నవ్య సంప్రదాయవాదిగా పరిగణించడం ప్రారంభించారు. ‘కాళిదాస కళామందిరం’, ‘సారమతి నన్నయ్య’ వంటి విమర్శన గ్రంథాలు రాశారు. ‘కాళిదాస కళా మందిరం’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ విమర్శన గ్రంథంగా పరిగణించింది. 1977-78 ప్రాంతంలో ఆయన రాసిన ‘కీర్తి తోరణం’ కావ్యం ఆయన కీర్తిప్రతిష్ఠలను వ్యాపింపజేసింది. దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కావ్యంగా గుర్తించింది. ఈ రెండు గ్రంథాల ఆధారంగా ఆయనకు ఈ అకాడమీలో గౌరవ సభ్యత్వం లభించింది. ఇక 1986లో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ తోడ్పాటుతో ఆయన రాసిన ‘ఆరు యుగాల ఆంధ్ర కవిత’ గ్రంథం నన్నయ్య నుంచి కంకంటి పాపరాజు వరకు ప్రసిద్ధ కవుల కవితా ప్రతిభను విమర్శనాత్మకంగా అంచనా వేసింది. 1987 నవంబర్ 14న ఆయన వరంగల్‌లో పరమపదించారు.
Indrakanti: చిరస్మరణీయుడు ఇంద్రకంటి
దాక్షారామం పద్య ఖండికతో ఆయన వెలుగు వెలిగారు