TDP-BJP: ఔనన్నా.. కాదన్నా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ స్నేహం కోసం చూస్తున్నారు. 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ-కమ్యూనిస్టులను కలుపుకొని మహాకూటమిగా తిరుగులేని విజయాన్ని దక్కించుకోగా.. 2019లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే.. ఇప్పుడు జనసేనాని పరోక్షంగా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. బీజేపీ మాత్రం ఇంకా సమదూరం నినాదం మీదనే ఉంది. అయితే, చంద్రబాబు మాత్రం సమయం వచ్చిన ప్రతిసారి బీజేపీకి సానుకూల సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నారు.
మరి బీజేపీ అంత బెట్టుగా ఉన్నా చంద్రబాబు ఎందుకింత ఆరాటపడుతున్నారు?. ఎందుకంటే దీని వెనుక రాజకీయ వ్యూహం పక్కాగా కనిపిస్తుంది. జనసేనాని ఇప్పటికే పొత్తుకి ఒకే చెప్పినా.. అది బీజేపీకి దూరమై టీడీపీకి సహకరిస్తారా? బీజేపీతో కలిసే పొత్తుకు వస్తారా అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే పవన్ బీజేపీతో కలిసే పొత్తుకు రావాలనే చూస్తున్నారు. కనుక బీజేపీని కూడా తనవైపుకు ఆకర్షించుకోవాలి.
చంద్రబాబు బీజేపీతో స్నేహం వెనకున్న మరొక కారణం ఎన్నికలలో పార్లమెంట్ స్థానాలు. కాంగ్రెస్ అధఃపాతాళానికి పడిపోయిన తర్వాత దేశంలో ఉన్న మిగిలిన ఏకైన అప్షన్ బీజేపీ. కాస్తో కూస్తో వ్యతిరేకత ఉన్నా.. అది బీజేపీ ప్రభుత్వంపై ఉంటుందే తప్ప ప్రధాని మోడీ ఫోటోపై ఓ రేంజ్ వ్యతిరేకత అయితే ఏపీలో ఉండదు. కనుక బీజేపీతో పొత్తు రానున్న ఎన్నికలలో పార్లమెంట్ స్థానాలలో గెలుపుకు కలిసివచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి తోడు బీజేపీతో అనధికార పొత్తులో ఉన్న వైసీపీకి చెక్ పెట్టేయవచ్చు.
నిజానికి ఏపీలో బీజేపీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. కానీ.. అర శాతమో ఒక శాతమో మోడీ ఛరిస్మా పార్లమెంట్ ఎన్నికలలో కనిపిస్తుంది. దానితో పాటు జనసేన కూడా తోడైతే వైసీపీని ఓడించడం సులభమవుతుంది. అందుకే చంద్రబాబు బీజేపీకి ఫ్రెండ్ షిప్ సిగ్నల్స్ పంపిస్తున్నారనిపిస్తుంది. ఏపీలో టీడీపీతో పొత్తు వలన బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా తెలంగాణలో మాత్రం అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఆంధ్రా సెటిలర్స్ ఓటింగ్ గణనీయం ఉంటుంది. వీళ్ళలో ఉమ్మడి రాష్ట్రంలో కొందరు కాంగ్రెస్.. మరికొందరు టీడీపీకి అనుకూలంగా ఉండేవారు.
కాంగ్రెస్ సానుభూతిపరులను ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్టీపీ ఆకట్టుకోవాలని చూస్తుంటే.. టీడీపీ సానుభూతిపరులు ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. తెలంగాణ టీడీపీ సీనియర్లు టీఆర్ఎస్ లో చేరడం కిందిస్థాయి వాళ్ళని ఆకర్షించడం.. టీడీపీ తెలంగాణలో కార్యకలాపాలకి దూరమవడంతో టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. అయితే.. వీళ్లంతా టీడీపీ మీద వ్యతిరేకతతో టీఆర్ఎస్ వైపు వెళ్ళలేదు. పార్టీ యాక్టివ్ లేకపోవడంతో కేసీఆర్ సైన్యంతో కలిశారు.
కనుక టీడీపీ మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ గా మారితే చంద్రబాబు అవసరం బీజేపీకి తప్పనిసరి అవుతుంది. అందుకే, చంద్రబాబు ఇప్పుడు ఆ పనిలో ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే.. మళ్ళీ తెలంగాణలో టీడీపీ జవసత్వాలు నింపుకోడం.. మళ్ళీ పేరున్న నాయకులను సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. మరి చంద్రబాబు ఇది ఎంతవరకు సాధిస్తారు? తెలంగాణ టీడీపీ బలాన్ని చూసి బీజేపీ స్నేహానికి చేయి చాపుతుందా అన్నది ముందు ముందు చూడాలి.