Thursday, September 19, 2024
HomeదైవంEurope: యూరప్ లో వెంకటేశ్వరుని కల్యాణాలు

Europe: యూరప్ లో వెంకటేశ్వరుని కల్యాణాలు

విదేశాల్లోని స్వామి భక్తుల కోసం టీటీడీ అందిస్తున్న సేవ

యూరోప్ లో పలు నగరాల్లో కన్నుల పండుగలా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూరప్ లోని నిన్న వారాంతములో అక్టోబర్ 07 వ తేదీన ప్యారిస్ (ఫ్రాన్స్), 08న డబ్లిన్ (ఐర్లాండ్) నగరాల్లో శ్రీ శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభావంగ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మలయప్ప స్వామి వారు NRI భక్తులకు దర్శనమిచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే…. ఆయా నగరాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహించాలని పలు తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి ఏపీఎన్ఆర్టీ సొసైటీకి వచ్చిన అభ్యర్థనల మేరకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఈవో శ్రీ ధర్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ, ఎక్కడ ఏలోటూ రాకుండా కల్యాణం సజావుగా సాగేలా చూసుకుంది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం నిర్వహించారు. అక్కడి నిర్వాహకులు… తితిదే బృందానికి, భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశారు.

ఈ రెండు నగరాల్లో స్వామివారి కల్యాణానికి వేదికను అలంకరించిన తీరు ఒక్కో నగరంలో ఒక్కోలాగా అందంగా ఉంది. ఈ కల్యాణోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి తెలుగు వారే కాక, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా ఇతర రాష్ట్రాలకు చెందిన అశేష సంఖ్యలో స్వామివారి NRI భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొన్న అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు.

ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ప్రవాసాంధ్రుల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మరియు APNRTS అధ్యక్షులు అయిన శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, తితిదే చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో స్వామివారి కల్యాణాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. తితిదే అర్చకులు, వేదపండితుల ద్వారా కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధాన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాలు నిర్వహించారన్నారు. ఇంకా UK లోని 2 నగరాల్లో ఈ నెల 14 మరియు 15 వ తేదీలలో శ్రీనివాస కల్యాణాలు జరుగుతాయన్నారు.

కల్యాణోత్సవాల్లో శ్రీ కన్నాబిరాన్, శ్రీ పొయ్యమోజి మార్క్, శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీ ఎ. అంకారావు శ్రీ పి. సంతోష్ శ్రీ డి. అనిల్ రావు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు.

ఈ కార్యక్రమంలో తితిదే నుండి Dy.EE శ్రీ. వి.జె. నాగరాజ, ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు, భారతీయులు పాల్గొన్నారు. SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి కల్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని వెబ్ లైవ్ కవరేజ్ ను సమన్వయము చేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News