Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Jalavivadam: జల వివాదంలో కొత్త మలుపు

Jalavivadam: జల వివాదంలో కొత్త మలుపు

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే దేశంలో నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడం అనేది అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం అని చెప్పక తప్పదు. నదీ జలాల వివాదంతో సంబంధం ఉన్న ఏ రాష్ట్రమూ ఒక్క చుక్క నీరు వదులుకోవడానికి కూడా సిద్ధపడదు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలే ఇందుకు ఉదాహరణలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నదీ జలాల వివాదం రావణ కాష్టం లాగా కొనసాగుతూనే ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2014లో విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇంతవరకూ అతీగతీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తొమ్మిదేళ్ల ప్రయత్నం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు నివేదించాలని నిర్ణయించింది. ఈ ట్రైబ్యునల్‌ నీటి మొత్తాన్ని మదింపు చేసి, ఏ రాష్ట్రం వాటా ఎంతో నిర్ణయిస్తుంది.
ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ చాలా కాలం నుంచి పట్టుబడుతున్నందు వల్ల దీన్ని తెలంగాణకు మొదటి విజయంగా భావించవచ్చు. ఈ రాష్ట్రం ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి హేతుబద్ధమైన కారణమే ఉంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 811 వేల మిలియన్‌ ఘనపుటడుగుల (టి.ఎం.సి అడుగులు) కృష్ణా నదీ జలాలు నికరంగా లభించేవి. ప్రాజెక్టులపరంగా ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 299 టి.ఎం.సి అడుగుల నీరు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 512 టి.ఎం.సి అడుగుల నీరు అందాల్సి ఉంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం (1956)లోని సెక్షన్‌ 3 కింద 2004లో ఏర్పడిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ 2013లో బచావత్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయాన్నే బలపరచింది. అయితే, వ్యవసాయ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. అప్పటి నుంచి ఈ వివాదం ఎక్కడి గొంగళి అక్కడే అన్న స్థితిలో ఉండిపోయింది.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహజంగానే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు కేటాయించిన 299 టి.ఎం.సి అడుగుల నీటిని పెంచాలని కోరింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కంటే తమ ప్రాజెక్టుల సంఖ్య, ఈ నీటి మీద ఆధారపడిన ప్రజల సంఖ్య బాగా పెరిగిందని అది పేర్కొంది. అసలు ఈ వివాదాన్ని పునఃపరిశీలించడానికి తీవ్ర అభ్యంతరం తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు ఎక్కువగా మళ్లించాల్సిన అవసరం ఉందని వాదించింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నందు వల్ల కేంద్రం రాజకీయ ప్రతిఫలాపేక్షతో ఈ అంశాన్నిబ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు అప్పగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలో లేశమాత్రంగానైనా నిజం లేదని వాదించడం కూడా జరుగుతోంది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎటువంటి మార్గదర్శకాలు అనుసరించబోతోందో చూడాలి. ఈట్రైబ్యునల్‌ వివాదాన్ని పరిష్కరించడానికి కాలపరిమితి ఏమిటో వెల్లడి కావాల్సి ఉంది. సంవత్సరాల తరబడి ఈ వివాదాన్ని పొడిగించడం వల్ల ఈ రాష్ట్రాలకు నష్టమే జరుగుతుంది తప్ప ఉపయోగమేమీ ఉండదు. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇది ప్రజలకు సంబంధించిన సమస్య అని, తాము పట్టు విడుపులతో వ్యవహరించాలని అర్థంచేసుకోవాలి. ఈ ట్రైబ్యునల్‌ కూడా మళ్లీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సామరస్య పరిష్కారాన్ని కనుగొనాలి. భవిష్యత్తు విభిన్నంగా ఉంటుందనే ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News