Chalapathi Rao : ఈ సంవత్సరం టాలీవుడ్ లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది అగ్రతారలని టాలీవుడ్ కోల్పోయింది. రెండు రోజుల క్రితమే కైకాల సత్యనారాయణ కూడా దూరమయ్యారు. తాజాగా ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ళ వయసులో శనివారం నాడు రాత్రి గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు.
1944లో కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన ఆయన 1966లో గూఢచారి 116 సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమయ్యారు. మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించిన ఆయన ఆ తర్వాత తండ్రి, బాబాయ్, మామ పాత్రల్లో నటించి మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి ఆయనకి సన్నిహితులుగా మారారు. దాదాపు 600 పైగా సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
నటించడమే కాక పలు సినిమాలని కూడా నిర్మించారు చలపతిరావు. ఎన్టీఆర్ కుటుంబానితో చలపతిరావుకి ప్రత్యేక అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఎన్టీఆర్ ముగ్గురితో కలిసి అనేక సినిమాల్లో నటించారు. చెన్నకేశవరెడ్డి, ఆది సినిమాల్లో ఆయన పాత్రలు హైలెట్ గా నిలిచాయి. ఆయన చివరిసారిగా గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ సినిమాలో కనిపించారు. అదే ఆయన చివరి సినిమా.
చలపతి రావుకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లో తన కుమారుడు రవిబాబు ఇంట్లోనే ఉంటున్నారు. ఒక కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చాకే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చలపతిరావు మరణంతో మరోసారి టాలీవుడ్ విషాదంలోకి వెళ్ళింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.