Bomb Cyclone: ఉత్తర అమెరికా వణికిపోతుంది. గత నాలుగు దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంత స్థాయిలో అక్కడ మంచు తుపాను బీభత్సం సృష్టిస్తుంది. ఈ బాంబ్ సైక్లోన్ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుండగా.. అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాలు మాత్రం అంధకారంలో ఉన్నాయి. బాంబు సైక్లోన్ ప్రభావం ఆదేశంలోని దాదాపు 13 రాష్ట్రాలపై పడింది. ఫ్లోరిడా, మేరిలాండ్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, కెంటకీ వంటి తదితర ప్రాంతాల్లో ప్రజలు క్రిస్మస్ వేడుకలకు దూరమయ్యారు. బయటకు వచ్చేందుకుసైతం వీలులేనంత స్థాయిలో ఆ ప్రాంతాల్లో బాంబు సైక్లోన్ బీభత్సం కొనసాగుతుంది. మంచు తుపానుకుతోడు చల్లటి ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలుచేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో దాదాపు 17లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలు అంధకారంలో ఉన్నాయి.
బాంబు తుపాను కారణంగా ఉత్తర అమెరికాలోని పలు ప్రాంతాల్లో 5,200 విమానాలు రద్దయ్యాయి. 21 మంది మృత్యువాత పడ్డారు. అమెరికా వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో క్రిస్మస్ సందడి పూర్తిగా కనిపించడం లేదు. 40ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలుసైతం నమోదవుతున్నాయి. బయటకు అడుగుపెడితే కొన్ని నిమిషాల్లో గడ్డకట్టుకుపోయేంత చలి ఆ ప్రాంతాల్లో ఉంది.
మంచు తుపాను బీభత్సం కారణంగా రోడ్లన్నీ మంచుతో నిండుకుపోయాయి. ఎక్కడచూసిన మంచు మోకాళ్లలోతు మేర రహదారులపై పేరుకుపోయి ఉంది. మంచు దుప్పటి కమ్ముకోవటంతో ఎక్కడ ఇళ్లు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాతాలకు తరలిస్తున్నారు. అయితే ఇండ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని అధికారులు అక్కడి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.