నగరంలో ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల విధులపై దిశా నిర్దేశం చేసేందుకు వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేదికలను సకాలంలో తయారు చేయాలన్నారు. అప్రమత్తంగా పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. పోలీసులు సమగ్ర శిక్షణ పొందాలని, సరైన వివరణలు ఇవ్వాలని స్పష్టం చేశారు. డీసీపీలు, ఏసిపిలు,నోడల్ ఏసిపిలు తమ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. తమ కార్యాలయాలు 24 గంటలు పని చేసేలా చూసుకోవాలని స్పష్టం చేశారు.ఇతర కమిషనరేట్ లతో సమన్వయం చేసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలు,మత్తు పదార్థాలకు ప్రలోభ పరిచే ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ ప్రచారాలు రూటింగ్, మ్యాపింగ్ సరిగ్గా చేయాలన్నారు. లైసెన్స్ తుపాకులు స్వాధీనం చేసుకోవాలని, ఎన్నికలు అయ్యేవరకు కొత్త లైసెన్స్ జారీ చేయిద్దని సూచించారు. నిఘా పెంచాలని, ఇంటిగ్రేటెడ్ కమిషనరేట్ చెక్ పోస్టులు 18కి పెరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా పని చేయాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా పెట్టాలన్నారు. పోలీసు సిబ్బంది ఫెసిలిటేటర్ సెంటర్ల ద్వారా ఓటు వేయాలని చెప్పారు. ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్ బాబు, సీఏఆర్ హేడ్ క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.