Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Diwali crackers: బాణసంచా పేలుళ్లపై నిషేధం అవసరం?

Diwali crackers: బాణసంచా పేలుళ్లపై నిషేధం అవసరం?

పటాసులు కాల్చటంపై ఇప్పటికే పలు ఆంక్షలు

దీపావళి దగ్గర పడుతుండడంతో బాణసంచా పరిశ్రమకు క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులోని శివకాశిలో బాణసంచా ఉత్పత్తిదారులంతా అహర్నిశలూ పనిచేయడం ప్రారంభించారు. వీరు తమ ఉత్పత్తులను తమ గోదాముల్లో నింపే విధానం మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరు శివార్లలో ఉన్న అత్తిబెళే అనే ప్రాంతంలో ఇటువంటి గోదాములో గత శనివారం పేలుళ్లు సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గోదాముల నిర్వహణలో భద్రతా నిబంధనలను పాటించడం లేదంటూ ఇక్కడి బాణసంచా వ్యాపారిని అధికారులు గత ఏడాదే హెచ్చరించారు. అయితే, ఆయన ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టడమే కాకుండా, తన రాజకీయబలంతో అధికారులకే హెచ్చరికలు పంపించడం జరిగింది. కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న అత్తిబెళే బాణసంచా ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు అనేక రకాల బాణసంచాను ఇక్కడ తక్కువ ధరలకు టోకుగా తీసుకు వెడుతుంటారు.
ఈ బాణసంచా తయారీ, భద్రతా చర్యలు వగైరా విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహిరంగ సభలు, ఊరేగింపుల్లో బాణసంచా పేల్చడాన్ని చాలా కాలం క్రితమే నిషేధించారు. పర్యావరణహిత బాణసంచాను కాల్చడానికి మాత్రమే ఆయన అనుమతినిచ్చారు. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని కూడా ఆయన అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల తీరుతెన్నులతో పోల్చి చూస్తే ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయమే. నిజానికి, ఢిల్లీలో అన్ని రకాల బాణసంచాను నిషేధించడం జరిగింది. హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు పూర్తిగా పర్యావరణహిత బాణసంచా వెరైటీలకు అనుమతి మంజూరు చేస్తున్నాయి. తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాలలో నిర్దిష్ట సమయాలలో మాత్రమే బాణసంచాను కాల్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు బాణసంచాలన్న దానిపై సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించింది. దేశంలోని వివిధ నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న స్థితిలో ఈ రకమైన నిషేధాలు ప్రజారోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. నిషేధాలు విధించినప్పటికీ అనేక రాష్ట్రాలలో వీటిని ఉల్లంఘించడం జరుగుతోంది కానీ, అధిక సంఖ్యాక ప్రజల్లో దీని పట్ల అవగాహన ఏర్పడుతోంది. బాణసంచా సృష్టించే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యాల వల్ల ఆరోగ్యం దెబ్బతినడం, కాలుష్య ప్రమాదం తలెత్తడం, చివరికి పెంపుడుజంతువులు కూడా తీవ్ర ఇబ్బందికి లోనుకావడం వంటి జరుగుతున్న విషయాన్ని తేలికగా తీసిపారేయలేం. అంతేకాక, బాణసంచా పేలుళ్ల వల్ల చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, ఆకస్మిక మరణాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.
బాణసంచా పేలుళ్ల వల్ల జరుగుతున్న అగ్ని ప్రమాదాలు పూర్తిగా మానవ తప్పిదాలేననడంలో సందేహం లేదు. భద్రతా చర్యల లోపం వల్లేఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. బాణసంచా ప్రదర్శన, కాల్చడం, భద్రత, నిల్వ చేయడం వంటి అంశాలు పేలుడు పదార్థాల చట్టం (1884), పేలుడు పదార్థాలు నిబంధనలు (2008) కిందకు వస్తాయి. వీటి ప్రకారం, పేలుడు బాణసంచా వస్తువులను ఒక దానికి దగ్గరగా మరొక వస్తువును ఉంచకూడదు. దగ్గరలో నీటి వసతి తప్పనిసరిగా ఉండాలి. నిప్పును ఆర్పే యంత్రాలు సిద్ధంగా ఉండాలి. గోదాము నుంచి బయటకు వెళ్లడానికి అనేక దారులుండాలి. అయితే, అనేక గోదాములు లేదా గిడ్డంగులలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. గదుల నిండా బాణసంచాను నింపేయడంతో పాటు, బాగా ఇరుకు ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అత్తిబెళేలోని గోదాములలో నిప్పును ఆర్పే యంత్రమేదీ లేదు. బయటకు వెళ్లడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. ముందు వైపు ద్వారానికి అడ్డంగా ట్రక్కు ఆగి ఉంది. వెనుక వైపు దారి బాగా ఇరుకుగా ఉంది. దానికి కూడా అట్టపెట్టెలు అడ్డంగా ఉన్నాయి. దీపావళి దగ్గర పడుతున్న కొద్దీ ఇటువంటి ప్రమాదాలు అనేకం వార్తల్లోకి వస్తుంటాయి. గత సోమవారం తమిళనాడులోని అరియలూరు జిల్లాలో ఒక బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 12 మంది సజీవ దహనమయ్యారు. వీటన్నిటినీ చూసినప్పుడు మనకు ఇటువంటి వేడుకలు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. బాణసంచా పేల్చడమంటే నిప్పుతో చెలగాటం ఆడడమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News