గత కొంతకాలంగా తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మొత్తానికి అనుకున్నంత పని చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల ఏకంగా తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. బీఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించిన పొన్నాల చాలాకాలంగా పార్టీలో ఇమడలేకపోతున్నారు. జనగామ అసెంబ్లీ టికెట్ తనను కాదని మరో అభ్యర్థికి కేటాయించే అవకాశాలున్నందున ఆయన పార్టీకి గుడ్ బై కొట్టారు. ఎమ్మెల్సీ ఛాన్స్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఎమ్మెల్యే సీటు కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన పొన్నాల రేవంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ, పలు ఆరోపణలు చేశారు. భూములు, విల్లాలు ఇస్తేనే కాంగ్రెస్ లో టికెట్ ఇస్తున్నారని పొన్నాల పేర్కొనటం సంచలనం సృష్టిస్తోంది. కాగా చాలాకాలంగా గాంధీ భవన్ కు చాలా అరుదుగా వస్తున్న ఆయన సొంత యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా రాజకీయంగా చురుగ్గా ఉన్నారు. నిజానికి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగి చాలాకాలమైందనే చెప్పాలి. మరోవైపు కుటుంబ సమస్యలతో ఆ మధ్య పొన్నాల ఇమేజ్ ఘోరంగా దెబ్బతినింది కూడా.
గతంలో పీసీసీ చీఫ్ గా, మంత్రిగా పనిచేసిన తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన భీష్మించుకోవటంతో పార్టీ నుంచి బయటికి వచ్చారు. కాగా బీఆర్ఎస్ లో పొన్నాల ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ కూడా ఆయనకు జనగామ నుంచి పోటీ చేసే అవకాశం ఏమాత్రం లేదు. ఈ నేపథ్యంలో పొన్నాల రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని ఆయన మద్దుతదారులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండటం విశేషం.