Corona Outbreak: చైనాలో మరోసారి కరోనా మరణ మృదంగం మోగుతోంది. మూడేళ్ల క్రితం ఇదే దేశంలో మొట్టమొదటగా మొదలైన మహమ్మారి రాక్షసత్వం విశ్వ వ్యాప్తంగా హడలెత్తించింది. కరోనా పోయిందని గత ఏడాదిగా అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్ళీ అదే చైనా నుండి చేదు వార్త వచ్చింది. అది కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అతి పెద్ద కోవిడ్-19 ఔట్ బ్రేక్ ని చైనా చూస్తోంది. రోజుకు సుమారు లక్షలు, కోట్లు కరోనా కేసులు, గంటల్లో వేలసంఖ్యలో మరణాలతో డ్రాగన్ కంట్రీ అంతలాకుతలం అవుతుంది.
చైనాలో ఇప్పుడు వైరస్ బారిన పడి జనాలు కోకొల్లలుగా మరణిస్తున్నారు. ఆసుపత్రులలో ఐసీయూలన్నీ రోగులతో నిండిపోతుంటే.. మరణించిన వారి అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. అయితే, స్మశానాలలో ఖాళీ లేక రోజుల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి.. ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయన్నది చైనా ప్రపంచానికి పూర్తిగా చెప్పట్లేదని ప్రపంచ దేశాల నుండి ఆరోణలు వినిపిస్తున్నా అక్కడ పరిస్థితి చూస్తే.. కరోనా ప్రళయంగానే కనిపిస్తుంది.
చైనాలో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి చైనాలో గరిష్ఠ స్థాయికి కొవిడ్ కేసులు పెరుగుతాయని.. చైనాలో కొవిడ్ మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరిగే ప్రమాదముందని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ అంచనా వేసింది. అదే జరిగితే చైనా జనాభా ఏ స్థాయిలో మృత్యువాత పడతారన్నది తలచుకుంటేనే వణుకుపుడుతుంది. ఇండియా లాంటి దేశాలకు ఆ స్థాయిలో ప్రళయం ఉండదని నిపుణులు చెప్తున్నప్పటికీ.. కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడడమే మన ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పొచ్చు.