బొల్లారం పారిశ్రామికవాడలోని అమర లాబ్స్ లో శుక్రవారం రాత్రి జరిగిన రియాక్టర్ల పేలుడులో తీవ్రంగా గాయపడి, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు.
ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతో ఫోన్లో మాట్లాడి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ప్రమాద ఘటనలో పరిశ్రమ నిర్లక్ష్యం కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి పరిశ్రమ కార్మికుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పలుమార్లు పరిశ్రమల యాజమాన్యాలకు సూచించామన్నారు. ప్రభుత్వంతో పాటు పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి కార్మికులకు మెరుగైన పరిహారం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వెంట బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు వరప్రసాద్ రెడ్డిలు ఉన్నారు.