World Test Championship Points Table : వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు భారత్ మరో అడుగు ముందుకు వేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయాలతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి భారత్ చేరుకుంది.
13 మ్యాచుల్లో గెలిచి 76.92 పర్సంటేజీతో ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమ్ ఇండియా 8 విజయాలు సాధించి 58.93 పర్సంటేజీ రెండో స్థానంలో 55.45 పర్సంటేజీతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆ తరువాత శ్రీలంక(53.33), ఇంగ్లాండ్(46.97) ఉన్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్(38.89) ఏడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్(25.93) ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, భారత్ చేతిలో క్లీన్‌స్వీప్ అయిన బంగ్లాదేశ్(11.11) ఆఖరి స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. తొలి టెస్టులో ఆ జట్టు ఆసీస్ చేతిలో ఘోరంగా ఓడడం భారత్‌కు కలిసివచ్చింది. మిగిలిన రెండు టెస్టుల్లో సఫారీలు విజయం సాధిస్తే భారత్‌ను అధిగమిస్తుంది. ఒకవేళ అదే జరిగితే.. భారత్ వేదికగా వచ్చే ఏడాది జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమ్ఇండియా ఓడించాల్సి ఉంటుంది. అలాగైతేనే ఇంగ్లాండ్‌లో జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడతుంది.