Drone Crash : ఓ డ్రోన్ కాసేపు అధికారులు, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. డ్రోన్ కారణంగా దాదాపు గంట సేపు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ ఘటన ఢిల్లీ మెట్రో స్టేషన్ లో చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే.. ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటల సమయంలో ఓ డ్రోన్ మెట్రో రైలు పట్టాలపై క్రాష్ అయ్యింది. దీంతో ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్‌ను కొద్దిసేపు మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే డ్రోన్ పడిన ప్రాంతానికి చేరుకున్నారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్‌ను తనిఖీ చేయగా అందులో మెడిసిన్స్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్‌ను ఓ ఫార్మా కంపెనీకి చెందినదిగా గుర్తించారు. మందులు పంపేందుకు సదరు కంపెనీ ఈ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అయితే.. మరిన్ని వివరాలను మాత్రం పోలీసులు తెలపలేదు.
షాహీన్ బాగ్-బొటానికల్ గార్డెన్ మార్గంలోని జసోలా విహార్ మెట్రోస్టేషన్ సమీపంలో డ్రోన్ ట్రాక్‌పై పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో రైళ్ల సేవలను నిలిపివేశారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టిన తరువాత తిరిగి సేవలను పునరుద్దరించారు. ఈ డ్రోన్ కారణంగా దాదాపు గంట పాటు రైలు సేవలకు అంతరాయం కలిగింది.
హైసెక్యూరిటీ ప్రాంతాల్లో డ్రోన్ల ముంపు పొంచి ఉందని, అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగించడం చట్ట విరుద్దం అని అధికారులు చెబుతున్నారు.