Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Droupadi Murmu: నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి

Droupadi Murmu: నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి

- Advertisement -

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం నేటి నుండి అయిదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపిలోని శ్రీశైలం దేవస్థానంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఈ నెల 26వ తేదీ (నేడు) ఉదయం నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. సున్నిపెంట హెలిపాడ్ వద్ద హెలికాఫ్టర్ దిగి అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం దేవస్థానికి చేరుకుని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కేంద్ర టూరిజం శాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

అనంతరం రాష్ట్రపతి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆ వెంటనే బొల్లారంలోని యుద్ద స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి వీర నారీమణులను రాష్ట్రపతి సత్కరిస్తారు. రాత్రి 7.45 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఇచ్చే విందులో పాల్గొంటారు. 27వ తేదీ ఉదయం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్ధులు, అధ్యాపకులతో రాష్ట్రపతి సమావేశమవుతారు,. మధ్యాహ్నం సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమిలో అఖిల భారత పోలీస్ సర్వీస్ 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతో రాష్ట్రపతి సమావేశమవుతారు. 28వ తేదీ భద్రాచలం, రామప్ప ఆలయాలను సందర్శించి ప్రసాదం స్కీమ్ ను ప్రారంభిస్తారు. అదే రోజు మిశ్ర ధాతు నిగం లిమిెటెడ్ కి సంబంధించి వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు.

29వ తేదీ ఉదయం షేక్ పేటలోని నారాయణమ్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాలను సందర్శించి విద్యార్ధులు, అధ్యాపకులతో సమావేశం అవుతారు. సాయంత్రం శంషాబాద్ లోని శ్రీరామ్ నగర్ లో శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని సందర్శిస్తారు. శ్రీరామానుజ మిషన్ ఆధ్వర్యంలో 30న రాంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతి వనంలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఏపికి చెందిన అంగన్ వాడీ వర్కర్ల ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక శాఖ, శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్టపతికి విందు ఇస్తారు.

రాష్ట్రపతి శీతాకాల విడిది, ఐదు రోజుల పర్యటన సందర్భంగా అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి పర్యటించే మార్గంలో రోడ్ల మరమ్మత్తులు, బారికేడింగ్ తదితర పనులు పూర్తి చేశారు. పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తొంది. రాష్ట్రపతి నిలయంలో ప్రోటోకాల్ అనుసరించి 24 గంటల పాటు విద్యుత్ శాఖ, వైద్య బృందాలను నియమించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంలో ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News